-ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించిన కేంద్ర బడ్జెట్
-ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతం ఇచ్చే బడ్జెట్
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ప్రత్యేక ధన్యవాదాలు
-వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ కి అభినందనలు
-పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో యువశక్తిని మేల్కొల్పాలి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మౌలిక ప్రగతికి బాటలు వేయడం ద్వారా 2047 నాటికి దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలపాలన్న బలమైన సంకల్పం… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ప్రస్ఫుటమవుతోంది. వికసిత భారత్ లక్ష్యాలు సాధించేందుకు ఎలాంటి సంస్కరణలను అమలు చేయాలి… ఆ లక్ష్యం వైపు ప్రజలను ఎలా అడుగుల వేయించాలి… యువశక్తిని ప్రేరేపిస్తూ దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలనే దృక్పథం 2026-2027 కేంద్రం బడ్జెట్ లో కనబడింది. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రిగా చరిత్ర కెక్కిన నిర్మలా సీతారామన్ కి అభినందనలు. సంస్కరణలే దేశ ఆర్ధిక ప్రగతికి మూలాలు అన్న సూత్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఆమె ప్రవేశ పెట్టిన ప్రతి బడ్జెట్ దేశాన్ని స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతూ వచ్చాయి. ప్రపంచం మొత్తం మాంద్యం వైపు అడుగులు వేస్తున్న సమయంలోనూ భారత దేశం తన సత్తా ఏంటో నిరూపించుకుంది. సంస్కరణలు, సంక్షోభ నివారణ, మౌలిక ప్రగతి, దేశ భద్రత, రైతు సంక్షేమం, వికసిత గ్రామీణ భారతం, ఆర్ధిక స్వావలంబన తదితర అంశాలకు పెద్ద పీట వేసిన 2026-2027 బడ్జెట్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన రక్షణ బలం ఏంటో ప్రత్యర్ధులకు చాటిన మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఈసారి బడ్జెట్ లో రక్షణ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రూ. 53.47 లక్షల కోట్ల బడ్జెట్ లో రూ. 7.84 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించడం ద్వారా దేశ రక్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చెప్పకనే చెప్పారు. బోర్డర్ సెక్యూరిటీతోపాటు దేశ అంతర్గత భద్రతకూ ప్రాధాన్యత ఇస్తూ ఈ సారి హోంశాఖకు రూ. 2.55 లక్షల కోట్లు కేంద్రం కేటాయించింది. సరిహద్దు భద్రత, అంతర్గత శాంతి భద్రతలు బలంగా ఉన్నప్పుడే దేశం ఆర్ధికంగానూ దూసుకుపోతుందన్న సూత్రాన్ని ఇక్కడ అమలులో చూపారు. రక్షణ రంగం తర్వాత రవాణా రంగానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. హైస్పీడ్ కారిడార్లతో దేశంలోని ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గించడం, రవాణా రంగానికి ఊతమివ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
రూ. 10 వేల కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్, పట్టణాల్లో చేపట్టిన కార్పోరేట్ మిత్రులు, ప్రజలకు ఈజ్ ఆఫ్ లివింగ్, వ్యాపారవేత్తలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటివి దేశంతోపాటు రాష్ట్ర ప్రగతికి చోదక శక్తిలా ఉపయోగపడతాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి మద్దతునిస్తుంది. రూ. 1.40 లక్షల కోట్ల వ్యవసాయ బడ్జెట్ రైతు సాధికారిత దిశగా అడుగులు వేయడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ ఎనర్జీ, విద్యా, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడతాయి. ముఖ్యంగా 17 రకాల క్యాన్సర్ ఔషధాలపైన, డయాబెటిక్ లాంటి దీర్ఘకాల వ్యాధులకు వినియోగించే మందులపైనా పన్ను తగ్గింపు కోట్లాది మందికి ఊరటనిచ్చే అంశం. డేటా సెంటర్ల ఏర్పాటు చేసే సంస్థలకు 2047 వరకు ప్రకటించిన టాక్స్ హాలిడే దేశాన్ని డేటా సెంటర్ల కేంద్రంగా మారుస్తుంది. ఇప్పటికే గూగుల్ లాంటి సంస్థలు విశాఖ కేంద్రంగా డేటా సెంటర్లు పెట్టేందుకు ముందుకు రాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మరిన్ని సంస్థల ఏర్పాటుకు దారిచూపనుంది. పర్యాటక రంగంలో ఇస్తున్న ప్రోత్సాహకాలు అరకు లాంటి పర్యాటక ప్రాంతాలకు ఊతం ఇవ్వనున్నాయి. బడ్జెట్ లో ప్రకటించిన ఏడు హైస్పీడ్ కారిడార్లలో రెండు రాష్ట్రం మీదుగా వెళ్లనున్నాయి. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ రాష్ట్ర తీర ప్రాంత పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం ఇస్తుంది. కేంద్రం ఎంపిక చేసిన రేర్ ఎర్త్ కారిడార్లలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం విలువైన ఖనిజాల వెలికితీత, తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. తీర ప్రాంత మత్స్యకార సర్క్యూట్ బలోపేతం చేయడం, మహిళలు చేపలు పెంచుకునే అవకాశం, ఎలాంటి సుంకం లేని చేపల పెంపకం వంటి నిర్ణయాలు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాయి. ముఖ్యంగా ఉప్పాడ 100 రోజుల ప్రణాళికకు ఈ బడ్జెట్ ఊతం ఇస్తుంది. చేనేత రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు రాష్ట్ర చేనేత పరిశ్రమను మరోస్థాయికి తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుంది. కొబ్బరి, జీడిపప్పు, కోకో రైతుల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలు కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి రైతులకు, ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని జీడి రైతులకు ఊరటనిస్తుంది. ఈ బడ్జెట్ భారత భవిష్యత్ శక్తి ఆవిష్కృత బడ్జెట్. బడ్జెట్ ఫలాలు రాష్ట్ర ప్రగతికి దోహదం చేసేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తాము. దేశ ఆర్ధిక వృద్ధికి దోహదం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ప్రత్యేక ధన్యవాదాలు.
Prajavartha Online Telugu News