-డేటా సెంటర్లకు టాక్స్ హాలిడేతో మరింతగా ఐటీ రంగం వృద్ధి
-రైతులు, మహిళలు, యువతలో ఆర్ధిక సాధికారితను పెంచేలా బడ్జెట్ కేటాయింపులు
-హైస్పీడ్ రైల్ , రేర్ ఎర్త్ కారిడార్లతో ఏపీకి మరింత లబ్ది
-కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను స్వాగతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-ప్రధాని మోదీకి, ఆర్ధిక మంత్రికి అభినందనలు తెలిపిన సీఎం
కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్ ను నిర్దేశించేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై సీఎం మీడియా సమావేశంలో స్పందించారు. కేంద్ర బడ్జెట్ ను స్వాగతిస్తున్నట్టు ఆయన తెలిపారు. అభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్ ను తీర్చిదిద్దినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్. రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విదానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించింది. వీటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. మహిళలు, రైతులు, యువత సాధికారిత సాధించేలా బడ్జెట్ ఉంది. 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది. బ్యాలెన్సుడు బడ్జెట్ ఇది. ఏఐ సహా ఆధునిక సాంకేతికత, తదుపరి స్థాయి సంస్కరణలకు బడ్జెట్ ఊతమిస్తుంది. పునరుద్పాదక విద్యుత్ తో పాటు వన్ గ్రిడ్ వన్ నేషన్ దిశగా సహకారం అందిస్తుంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా బడ్జెట్ ఉంది. హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఉపయోగం ఉంది. తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హైస్పీడ్ కారిడార్ల ద్వారా అనుసంధానం అవుతాయి. బెంగుళూరు- చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ వల్ల పలమనేరు, చిత్తూరు, తదితర ప్రాంతాలకు కనెక్టివిటి వస్తుంది. ఈ మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీలోని వివిధ ప్రాంతాలను కవర్ చేస్తాయి. హైదరాబాద్, అమరావతి, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు అన్ని అనుసంధానం అవుతాయి. డెడికేటెడ్ రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లో ఏపీ కూడా ఉంది. అత్యంత విలువైన ఖనిజాలు వెలికి తీసి క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపకరించే అవకాశం ఉంది. ఐఎస్ఎం 2.0 ద్వారా సెమీ కండక్టర్ కు రూ.40 వేల కోట్లు పెట్టారు. టెక్స్ టైల్ రంగం కూడా వృద్ధి చెందేలా బడ్జెట్ ఉంది. పర్యాటకానికి, హాస్పిటాలిటికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అరకు రీజియన్ అభివృద్ధి అంశాన్ని కేంద్ర బడ్జెట్లో పెట్టారు. పులికాట్ సరస్సు అభివృద్ధికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఫ్లెమింగోలు అరుదైన పక్షులు కూడా ఆ ప్రాంతానికి ఆలవాలంగా ఉంటాయి. కోకోనట్, జీడి, కోకో, చందనం లాంటి పంటలకు అభివృద్ధికి కార్యాచరణ ప్రకటించారు. ఇవన్నీ ఏపీ అభివృద్ధికి మేలు చేసే అంశాలే.” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
లాజిస్టిక్స్ రంగంపై కేంద్రం తొలిసారి ప్రస్తావన
డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ పెట్టారు. భారత్ డేటా సెంటర్ల హబ్ గా తయారవుతుంది. విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయి. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. 2047 వరకూ టాక్స్ హాలిడే వల్ల డేటా సెంటర్లు పెద్ద ఎత్తున దేశంలోకి విస్తరిస్తాయి. బిల్ గేట్స్ కూడా త్వరలో అమరావతిలో పర్యటించబోతున్నారు. ఏఐ, క్వాంటం, డేటా సెంటర్స్ లాంటి నెక్స్ జెన్ టెక్నాలజీస్ కు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. లాజిస్టిక్స్ రంగంపై ఏపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కేంద్ర బడ్జెట్టులో తొలిసారిగా లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఈస్ట్ కోస్ట్ కారిడార్ వల్ల లాజిస్టిక్స్ పరంగా గణనీయమైన వృద్ధి నమోదు అవుతుంది. అంతర్గత జల రవాణా కోసం బడ్జెట్లో నిధులు పెట్టారు. వెయ్యి కిలోమీటర్ల పొడవైన మన తీర ప్రాంతం అంతా గణనీయమైన వృద్ధి చెందుతుంది. లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఇప్పటికే ఏర్పాటు చేశాం. పట్టణాల అభివృద్ధి, గ్రోత్ సెంటర్లకు నిధులు కేటాయించారు. విశాఖ ఆర్ధిక రీజియన్, తిరుపతి గ్రోత్ రీజియన్, అమరావతి రీజియన్లు వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కంటైనర్స్ ద్వారా లాజిస్టిక్స్ మరింత వేగవంతం అవుతాయి. రీజినల్ మెడికల్ హబ్స్ , ఆయుష్ హబ్స్ ఏర్పాటుకు కూడా బడ్జెట్లో నిధులు ఇచ్చారు. వీటన్నిటినీ ఇంటిగ్రేట్ చేసుకుని ఏపీ వృద్ధి చెందే అవకాశం ఉంది. సంజీవని ప్రాజెక్టు ఈ ఏడాదిలో ఓ గేమ్ చేంజర్ గా మారుతుంది. అని సీఎం అన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మరింత ఊతం
వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానం ద్వారా ప్రతీ ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. 75 శాతం ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ ఇచ్చేలా కేంద్రం నిర్ణయించింది… రాష్ట్రం తరపున 20 శాతం ఇస్తున్నాం. స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్ కు వెళ్లేలా మరిన్ని సంస్కరణలు రావాలి. ఇప్పటికే జీఎస్టీ సంస్కరణలు, కార్మిక సంస్కరణలు వచ్చాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెస్సు ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ సాధ్యం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పాలసీలకు వెసులుబాటు కల్పించేలా బడ్జెట్ ఉంది. పూర్వోదయ ద్వారా నిధులు ఇస్తామని బడ్జెట్లో పెట్టారు. రాయలసీమను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేలా మేం ప్రయత్నాలు చేస్తాం. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యాన క్లస్టర్ గా రాయలసీమ జిల్లాలు మారబోతున్నాయి. డీపీ వరల్డ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. పూర్వోదయ ద్వారా నిధులు ఇస్తామని బడ్జెట్లో పెట్టారు.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తిరుమలపై రాజకీయం చేస్తున్నారు
“2019-24 మధ్య జరిగిన వారసత్వంగా వచ్చిన సమస్యలు ఉన్నాయి… వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నివేదిక వచ్చింది. తిరుమల పవిత్రతను కాపాడ్డానికి చర్యలు తీసుకుంటున్నాం. ఎన్డీడీబీ నివేదిక వచ్చింది… కల్తీ నెయ్యి అని ఆ నివేదిక చెప్పింది. దీనిపై సిట్ వేసి నివేదిక ఇస్తే మళ్లీ నాపై ఆరోపణలు చేసే స్థాయికి వచ్చారు. మహా ద్వారం ద్వారా వెళ్లే అవకాశం ఉన్నా… సామాన్య భక్తుడిగానే స్వామి దర్శనానికి వెళ్తున్నాను. అపచారం చేసి, మహాపాపం చేసి దానిని కప్పి పుచ్చుకోవడానికి నాపైనే తిరిగి దాడి చేస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామిని కూడా రాజకీయం చేస్తున్నారు.” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
Prajavartha Online Telugu News