Breaking News

కొవ్వూరు నియోజక వర్గంలో పర్యాటక అభివృద్ధిపై సమగ్ర సమీక్ష

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త:
రాబోయే పుష్కరాలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పర్యాటక అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు తెలిపారు. మంగళవారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో ఆర్డీవో రాణి సుస్మిత అధ్యక్షతన పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, పుష్కరాల నిర్వహణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో జిల్లాలోని సహజ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేసి, పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. శాసన సభ్యులు సూచించిన మేరకు ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేసే అంశంపై ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అలాగే రాజమండ్రి తరహాలో వచ్చే పుష్కరాల సమయానికి కొవ్వూరు వైపు కూడా ఘాట్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించవలసి ఉందని తెలిపారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రతిపాదిత పనులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పర్యాటక శాఖ అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు, పర్యాటకులకు ఉపయోగపడే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన అన్నారు. విజ్జేశ్వరం నుంచి తాడిపూడి వరకు కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతం విస్తృతంగా ఉందని, ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ పనులకు సంబంధించి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వారి సహకారంతో అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కుమార దేవరం – అరిక రేవుల మధ్య గోదావరిలో ఉన్న లంక ప్రాంతంలో కూడా పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఆర్డీవో స్థాయిలో ప్రాథమిక ప్రతిపాదన సిద్ధం చేశామని, వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి డీపీఆర్ సిఫారసు చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ అధికారులు ఎన్.వి.వి.ఎస్. మూర్తి – ఆర్‌డీ, టూరిజం, పీ. వెంకటాచలం – జిల్లా పర్యాటక అధికారి, తూర్పు గోదావరి జిల్లా విజయ భాస్కర్ రెడ్డి – ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *