– ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరో చారిత్రాత్మక ఆర్థిక విజయం
– ఎంపీ సానా సతీష్ బాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ ఉత్పత్తులపై పన్నులు 50 శాతం నుంచి కేవలం 18 శాతానికి తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు నిజమైన ‘గేమ్ ఛేంజర్’ గా నిలుస్తుందని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. తాజాగా కుదిరిన భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ద్వారా ఈ కీలక నిర్ణయం అమలులోకి వచ్చిందని పేర్కొన్న ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో భారత్ మరో చారిత్రాత్మక అంతర్జాతీయ ఆర్థిక విజయాన్ని సాధించిందన్నారు. ఆసియా దేశాల్లోనే అత్యల్ప పన్ను శాతం భారత్‌కు వర్తించడం విశేషమని, దీని వల్ల ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత పోటీ సామర్థ్యాన్ని సాధించనున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా తీరప్రాంతాలకు గణనీయమైన లాభాన్ని చేకూరుస్తుందని తెలిపారు. కాకినాడ తదితర ప్రాంతాల నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా మరియు సముద్ర ఆహార ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు మరింత సులభంగా చేరనున్నాయని అన్నారు. దీని ద్వారా వేలాది మంది మత్స్యకారులు, రొయ్యల రైతులు, ఎగుమతిదారులు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతతో పాటు కొత్త ఆశలు కలుగుతాయని ఎంపీ సానా సతీష్ బాబు పేర్కొన్నారు. ఈ ట్రేడ్ డీల్ భారత్–అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, భారతదేశాన్ని గ్లోబల్ ట్రేడ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఇంతటి దేశహితమైన, దూరదృష్టి గల నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News