Breaking News

అరుగోలను జడ్పీ హైస్కూల్ వార్షికోత్సవం

-రూ.58.5 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జడ్‌పీ స్కూల్ ప్రహరీ గోడ, సిమెంటు రోడ్డు ప్రారంభోత్సవం మరియు పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా రోడ్లు మరియు భవనాల శాఖ మౌలిక సదుపాయాలు–పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంపీ కృష్ణబాబు, ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని అభివృద్ధి పనులను ప్రారంభించారు. MGNREGS నిధులు రూ.23 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను, రూ.7 లక్షలతో వేసిన సిమెంటు రోడ్డును వారు ప్రారంభించారు. అలాగే జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు మరియు ప్రభుత్వ నిధులు కలిపి మొత్తం రూ.21 లక్షలతో నిర్మించిన మూడు తరగతి గదులు, సాయి దీపా రాక్ డ్రిల్ల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.విద్య లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంపీ కృష్ణబాబు మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సంఘం (అలుమ్ని అసోసియేషన్) కీలక పాత్ర పోషిస్తున్నదని అన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు పూర్వ విద్యార్థులు 30 నుంచి 40 శాతం వరకు ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 330 నుంచి 350 మంది విద్యార్థులు చదువుతుండగా, అందులో 97 మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థులైన ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన విద్యాలయాల వల్ల అనేక మంది ఉన్నత శిఖరాలకు ఎదిగారని అన్నారు. ఇదే పాఠశాలలో చదువుకుని ఐఏఎస్ అధికారిగా ఎదిగి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఈ ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. గతంలో సీతారామయ్య సెయింట్ జాన్స్ స్కూల్ ఏర్పాటుకు భూమిని దానం చేయడం వల్ల అనేక మంది ఎన్ఆర్ఐలుగా విదేశాల్లో స్థిరపడిన ఉదాహరణను గుర్తు చేస్తూ, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. కృష్ణబాబు సేవలను ఆదర్శంగా తీసుకుని ఎన్ఆర్ఐలు కూడా ముందుకు రావాలని కోరారు.

ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా, ఉన్నత స్థాయిలో ఉన్న వారు వీలైనంత మేర సహాయం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఆర్డీఓ బాల సుబ్రమణ్యం, అలుమ్ని అసోసియేషన్ సెక్రటరీ జాస్తి శరత్ బాబు, పాఠశాల ప్రిన్సిపాల్ దుర్గా ప్రసాద్‌తో పాటు విద్యార్థులు, అలుమ్ని సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *