అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించింది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వ్యాపార ప్రతిపాదన సంస్థ యూ.ఎస్-ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ (U.S.-India SME Council, Inc.) మంత్రి విశేష సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించింది. యూ.ఎస్-ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ వాషింగ్టన్ డీసీలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక లాభాపేక్షలేని సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (SMEs) అభివృద్ధి కోసం ఈ కౌన్సిల్ కృషి చేస్తోంది. యూ.ఎస్-ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ సీఈఓ & ప్రెసిడెంట్ ఎలీషా బి. పులివర్తి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు అమెరికా అధ్యక్షుని పేరుతో ఇచ్చే “ది ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డు” (The President’s Volunteer Service Award) ను అందజేశారు. రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల బలోపేతం, మహిళా నేతృత్వంలోని పరిశ్రమలకు ప్రోత్సాహం, సెర్ప్ ద్వారా గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాల పెంపు, స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానం చేయడం కోసం చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU)
రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహం కోసం యూ.ఎస్-ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికాలోని పెట్టుబడులను, సాంకేతికతను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి, ఎన్ఆర్ఐల భాగస్వామ్యాన్ని పెంచడానికి మార్గం సుగమం కానుంది. ఈ కార్యక్రమంలోయూ.ఎస్-ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ సిఈఓ/ప్రెసిడెంట్, . ఎలీషా బి. పులివర్తి, వైస్ చైర్మన్ కె. శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ ఎం.ఎస్.ఎమ్.ఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ విశ్వ మనోహరన్, ప్రధాన సాంకేతిక సలహాదారు డాక్టర్ ఎమ్. శ్రీనివాస శంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News