గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అన్ని సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఈ నెల 5వ తేదీన సదస్సును నిర్వహిస్తున్నారు. “మన నీరు-మన భవిష్యత్తు” సాగునీటి సంఘాల పాత్ర శీర్షికన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సదస్సు నేలపాడు (అమరావతి)లో హైకోర్టు దగ్గర పెరేడ్ గ్రౌండ్స్ లో 5వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుండి జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 12 వేల సాగునీటి సంఘాల అధ్యక్షులు హాజరు కానున్నారు.
ఈ సదస్సు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ బి.రాంబాబులతో కలిసి జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామా నాయుడు బుధవారం పరిశీలించారు. భోజన వసతి ఏర్పాట్లు, తాగునీరు, పారిశుధ్యం తదితర అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.
ఉదయం 10 గంటల నుండి సాగునీటి సంఘాల అధ్యక్షుల రాక ప్రారంభం అవుతుందని, జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్ లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి డా.నిమ్మల రామా నాయుడు చెప్పారు.
ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, ఏఎస్పీ ఏ.టి.వి రవి కుమార్, డిఎస్పీ టి.మురళీ కృష్ణ, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News