Breaking News

శ్రీవారి ప్రసాదంపై రాజకీయ కుట్రలు ఆపాలి : తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. తిరుమలను రాజకీయ రణక్షేత్రంగా మార్చడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

డిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వివాదంలో ఉన్న భోలే బాబా డైరీ, ప్రీమియర్ డైరీ వంటి సంస్థలు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాం నుంచే నెయ్యి సరఫరా చేస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కొందరు సరఫరాదారుల సిండికేట్‌ను అరికట్టి, పారదర్శకమైన టెండర్ విధానం ద్వారా అందరికీ సమాన అవకాశం కల్పించామని వివరించారు.

ఈ ప్రక్రియలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చిన వెంటనే అప్పటి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి బాధ్యతాయుతంగా స్పందించి, ఆ నమూనాలను మైసూర్ లోని సిఎఫ్‌టిఆర్‌ఐ కి పంపారని, నాణ్యత లేని సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం జరిగిందని తెలిపారు. కానీ నేడు టిడిపి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఆ నివేదికలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.

నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ చార్జ్ షీట్ లోనే స్పష్టంగా ఉందని, అయినా వైఎస్సార్సీపీపై బురద చల్లడమే లక్ష్యంగా టిడిపి అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎంపీ విమర్శించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి “డైవర్షన్ పాలిటిక్స్ “కు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు. వై.వి. సుబ్బారెడ్డి దేవునిపై భక్తిశ్రద్ధలతో దేశవ్యాప్తంగా సుమారు 2 వేలకు పైగా ఆలయాలను నిర్మించి హిందూ ధర్మ ప్రచారానికి కృషి చేశారని, అలాంటి వారిపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారికి ఆ స్వామివారే తగిన బుద్ధి చెబుతారని ఎంపీ గురుమూర్తి హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *