– సేవల పంపిణీని మెరుగుపరిచేందుకు వీలు
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాల లక్ష్యసాధన, సమర్థవంతమైన అమలు, పర్యవేక్షణ, సేవల పంపిణీని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎఫ్‌బీఎంఎస్)ను అభివృద్ధి చేస్తోందని.. ఇందులో భాగంగా అత్యంత కచ్చితత్వంతో ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే (యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గ్రామవార్డు సచివాలయ కుటుంబ డేటాబేస్‌లో నమోదైన కుటుంబాలను కవర్ చేస్తూ సర్వే నిర్వహించడం జరుగుతోందన్నారు. అర్హులైన కుటుంబాలకు సంక్షేమ ప్రయోజనాలు అందించడం, రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్‌ను సంతృప్తికర స్థాయిలో నాణ్యంగా రూపొందించడం, వివిధ శాఖల ద్వారా ఆధార సహిత విధానాల రూపకల్పనకు దోహదం చేయడం లక్ష్యంగా సర్వే నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రాథమిక సమాచారంతో పాటు సామాజిక, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర సమాచారంతో డేటా బ్యాంకు రూపకల్పన జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
కలెక్టర్ వెంట జోనల్ కమిషనర్ ప్రభుదాస్ తదితరులు ఉన్నారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
Prajavartha Online Telugu News