-శివరాత్రి ఏర్పాట్లు 2027 గోదావరి పుష్కరాలకు తొలి ట్రైల్ రన్ : కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న 2027 మహా గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని అన్ని స్నాన ఘాట్లు ఒకే ఆకృతిలో, ఒకే స్ట్రెచ్‌లో ఉండేలా మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ధవళేశ్వరం నుంచి సరస్వతి ఘాట్, మార్కండేయ ఘాట్, పుష్కర్ ఘాట్ వరకు ఉన్న పలు ఘాట్లను ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఆర్ఎంసి కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, పుష్కర పుణ్య స్నానాలు ఏర్పాట్ల నేపథ్యంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించడమే ప్రథమ లక్ష్యమని తెలిపారు. శివరాత్రి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పుష్కరాలకు తొలి ట్రైల్ రన్‌గా భావించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. ముందుగా ఒక మోడల్ ఘాట్‌ను నిర్మించి, అదే డిజైన్‌ను మిగిలిన ఘాట్లకు అనుసరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో మోడల్ ఘాట్ నమూనాను తక్షణమే సిద్ధం చేయాలన్నారు. ప్రముఖుల సందర్శనల సమయంలో కూడా సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక స్నాన ఘట్టాలు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా సెక్యూరిటీ మరియు క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను పకడ్బందీగా రూపొందించాలని ఎస్పీ డి. నరసింహ కిషోర్ అధికారులను ఆదేశించారు. స్నాన ఘాట్ల వద్ద రాకపోకలకు సంబంధించి రూట్ మేనేజ్మెంట్ అమలు చేయాలని, ఎక్కడా తాకిడి లేకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఘాట్ల అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ప్రాథమిక కార్యాచరణను వివరించారు. ఘాట్ల వెంబడి పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, గ్రీనరీ అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసి కమిషనర్ రాహుల్ మీనా, ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఇరిగేషన్ ఎస్ఈ కె. గోపినాథ్, టూరిజం ఆర్డీ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, నగరపాలక సంస్థ, టూరిజం శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News