Breaking News

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రూ 30 లక్షలతో అత్యాధునిక అంబులెన్స్‌ అందజేత…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి శనివారం ఏలూరు యంపి సౌజన్యంతో (యంపి నిధులు) సుమారు రూ 30 లక్షలతో అత్యాధునిక అంబులెన్స్‌ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి అధికారులకు లాంఛనంగా అందజేశారు. ఇంచార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, ఏపి వడ్డి కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపియస్ఆర్టీసీ విజయవాడ-2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు లు సంయుక్తంగా పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యులు నిధులు నుండి రెండు అంబులెన్స్ మంజూరైనను మొదటి అంబులెన్స్ వాడుకలోకి తేవడానికి ఆలస్యం అవ్వటం పట్ల ఇంచార్జ్ మంత్రి అసహనం చేశారు. అంబులెన్స్ లో లోపల ఉన్న సౌకర్యాలను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండవ అంబులెన్స్ ఈనెల చివరినాటికి వాడుకలోకి తీసుకురావాలని అధికారులకు జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగవంతమైన సేవలు అందించడంలో అంబులెన్స్ లు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అంబులెన్స్ అందించడం పట్ల ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ను ఇంచార్జ్ మంత్రి అభినందించారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు మరింత అందు బాటులోకి వస్తాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ఏలూరు జిల్లా వైద్యఆరోగ్య శాఖ హాస్పిటల్లో వసతులను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు.

ఆసుపత్రిలోని అవుట్‌ పేషెంట్లతో మాట్లాడుతూ ఏ ఊరు నుండి వచ్చారని, ఆస్పత్రిలో వైద్యసేవలు ఏలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కువ సేపు ఉండటం చూసి అసహనం వ్యక్తం చేస్తూ, గర్భిణీ స్త్రీలు వచ్చిన వెంటనే ఒక లేడీ సహాయంతో వైద్యులు దగ్గర తీసుకువెళ్ళి వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. వైద్యసేవలు పొందడానికి వైద్యులు దగ్గరికి వెళ్ళే రిజిస్ట్రేషన్ కౌంటరు లైన్లో ఉన్న రోగులతో ఇంచార్చి మంత్రి మాట్లాడారు. ఎక్స్ రేలు ఒక్క పూట మాత్రమే తీస్తున్నారని దీనివలన చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఒక రోగి బంధువు ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రెండు పూటలు ఎక్స్ రేలు తీసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఇంచార్జ్ మంత్రి ఫిర్యాదులు వస్తే తక్షణం పరిష్కారం చూపాలని కాలయాపనలు చేస్తే పరిస్థితి జఠిలం అవుతుందని, రెండవ పూటకూడా ఎక్స్ రేలు తీసేలా చర్యలు చేపట్టి పూర్తిస్థాయిలో నివేదికలు అందించాలని హాస్పిటల్ సూపర్డెంటును జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి వేలాది కోట్లు కేటాయిస్తుందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించవలసిన బాధ్యత అధికారులు, వైద్యాధికారులుదేనని స్పష్టం చేశారు. ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లను చిరునవ్వుతో పలకరిస్తే సగం జబ్బు నయం అవుతుందని, మిగిలిన సగం జబ్బు మీరిచ్చే వైద్యసేవలుతో తగ్గుతుందని అన్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మందులు కొరత లేకుండా చూడాలని, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు జుత్తుగ నాగరాజు, డిసియం యస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణిశివ ప్రసాదు, కో -ఆప్షన్ సభ్యులు యస్.యం.ఆర్. పెదబాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం, డిసిహెచ్ యస్ డా.బి.పాల్ సతీష్ కుమార్, ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్ ఇంచార్చి సూపర్డెంటు డా.యం. రవిచంద్ర, తహశీల్దారు కె.గాయత్రి దేవి, ఏపియంయస్ ఐ డిసి ఇఇ ఓ.యస్. వై.రాజబాబు, జిల్లా రెడ్ క్రాసు చైర్మన్ డా.యం.బి.యస్.వి. ప్రసాదు, వైస్ చైర్మన్ జె. సత్యనారాయణ రాజు, ప్రభుత్వ వైద్యాధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *