Breaking News

బలమైన భవిష్యత్తుకి పునాది వేసిన బడ్జెట్

– కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-రాజకీయాలు కాదు.. భవిష్యత్ ముఖ్యం
-మరో ఇరవై ఏళ్ళు 7% వృద్ధి రేటుతో దేశం
-కీలక రంగాల్లో ఏపీకి అధిక కేటాయింపులు శుభసూచకం
-విశ్వ బంధువుగా భారత్.. అంతర్జాతీయ వేదికపై హుందాతనాన్ని చూపుతున్న మోదీ
-విమాన విడి భాగాలపై పన్ను సడలింపుతో తయారీ రంగంలో విప్లవాత్మక అభివృద్ధి

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలు, రాష్ట్రాల ఎన్నికలు దృష్టిలో లేకుండా.. 140 కోట్ల మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాజా బడ్జెట్ ను ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శనివారం నాడు రాజమండ్రి నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నాయకులతో కలసి ఆయన పాల్గొన్నారు. దేశ భవిష్యత్ ను అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా తాజా బడ్జెట్ ను రూపొందించారని అన్నారు.

2014 కు ముందు మోదీ ప్రధాని కాక మునుపు బలహీన దేశమనే చిన్న అప్రతిష్ఠ ను మనం మోసేవాళ్ళమని.. నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. డిజిటల్ ఇండియా, యువతకు భాగస్వామ్యం నేపథ్యాలుగా తాజా బడ్జెట్ రూపకల్పన జరిగిందని.. దేశంలోని ప్రతీ పౌరునికి ఫలితం దక్కాలనే ఉద్దేశంతోనే బడ్జెట్ కూర్పును నిర్మలా సీతారామన్ చేశారని అన్నారు.

21 వ శతాబ్దంలోని నాలుగు భాగాల్లో.. రెండవ పార్శ్వం లోకి అడుగుపెడుతున్న సంధర్భంలో తొలి బడ్జెట్ ఇది అని తెలిపిన రామ్మోహన్ నాయుడు.. ఈ బడ్జెట్ ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడానికి బలమైన అడుగులు వేయొచ్చని అన్నారు.

వరుసగా 9 సంవత్సరాలు ఒక మహిళ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఒక రికార్డు అయితే.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే నిధులు అనే అపవాదును ఈ తొమ్మిదేళ్లు ఆమె ఎక్కడా చూపలేదని కితాబిచ్చారు.

7% వృద్ధి రేటుతో ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందుతోందని.. మరొక్క ఇరవై ఏళ్ళు కూడా ఇవే గణాంకాలు కొనసాగుతాయని ఐ.ఏం.ఎఫ్ నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నట్టు తెలిపారు. అమెరికా, చైనా వంటి దేశాల్లో కూడా ఈ వృద్ధి రేటు కేవలం 2,3 శాతమే ఉన్నట్టు గుర్తు చేశారు.

రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో.. భవిష్యత్ లో తయారీ రంగం కీలకంగా మారనుందని అన్నారు. ఇందులో మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని స్పూర్తిగా తీసుకుని అధిక నిధుల కేటాయింపు తాజా బడ్జెట్ లో జరిగినట్టు రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు.

రేర్ ఎర్త్ కారిడార్ ను అభివృద్ధి చెయ్యడం ద్వారా.. దిగుమతులను తగ్గించి.. దేశంలోనే సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ డివైస్ లను తక్కువ ఖర్చుతో తయారు చేయొచ్చని అన్నారు. బయో ఫార్మా ఇండస్ట్రీలకు అధిక నిధులు కేటాయింపు చేసి.. అందులో ట్రైనింగ్, స్కిల్లింగ్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. హెల్త్ సర్వీసెస్, ఐటీ సెక్టార్ లలో నిపుణులను ప్రపంచానికి 10% అందించే స్థాయికి భారత్ వెళ్లేలా.. తాజా బడ్జెట్ ప్రోత్సాహకంగా ఉందని అన్నారు. గతంలోనే సెమీ కండక్టర్ల తయారీకి ప్రోత్సాహం అందించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. సెమీ కండక్టర్ల ఉత్పత్తి దేశాలు అరుగుదుగా ఉండగా.. అందులో భారత దేశాన్ని చేర్చారని అభినందనలు తెలియజేశారు. ఐటీ రంగం వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూకుడు ప్రదర్శిస్తోందని, ఏ.ఐ హబ్, క్లౌడ్ సర్వీసెస్, డాటా సెంటర్ హబ్స్ తో బలమైన అడుగులు ఆంధ్రప్రదేశ్ వేస్తోందని కితాబిచ్చారు

ప్రభుత్వాలు ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వాటిని వినియోగించుకోవాలనే ఆలోచన యువతకు ప్రధానంగా రావాలని కోరారు. యువత పారిశ్రామికవేత్తలు గా మారాలని పిలుపునిచ్చారు.

ఎమ్.ఎస్.ఏం.ఈ, డిఫెన్స్ రంగాలకు సైతం తాజా బడ్జెట్ లో ఘనమైన కేటాయింపులు జరిగాయని అన్నారు. ఒకప్పుడు డిఫెన్స్ యంత్రాలను దిగుమతి చేసుకొనేవాళ్ళమని.. నేడు ఇతరులపై ఆధారపడకుండా.. బలమైన డిఫెన్స్ వ్యవస్థను నిర్మించుకున్నామని అన్నారు. ఉగ్రదాడికి సమాధానం ఇచ్చిన ఆపరేషన్ సింధూర్ నే.. మన ప్రతిభకు నిదర్శనంగా మారిందని గుర్తు చేశారు.

విశ్వ బంధువుగా భారత్ నిలిచిందని, యు.కే, యూఎస్, ఈ.ఎఫ్.టి.ఏ, ఈ.యూ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుంటుండటం ఇందుకు అద్దం పడుతోందని అన్నారు. అసాధ్యం అనుకున్న యూఎస్ఎ తో ఒప్పందాన్ని.. మనకు లాభం ఉండే రంగాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటూ.. తనదైన హుందాతనాన్ని మోదీ చూపారని గుర్తు చేశారు.

దేశ అభివృద్ధి.. రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉందని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు.. రైల్వేలు, ఎయిర్పోర్ట్, పోర్ట్, జాతీయ రహదారుల అభివృద్ధి కోసం అధిక నిధుల కేటాయింపు జరిగిందని అన్నారు. 7 హైస్పీడ్ రైలు కారిడార్లు మంజూరు కాగా.. అందులో రెండు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళుతుండటం శుభసూచకం అని అన్నారు. బుల్లెట్ రైలు గురించి అవహేళన చేసిన వారంతా అవాక్కయ్యేలా.. త్వరలో అహ్మదాబాద్, ముంబై మార్గంలో బుల్లెట్ రైలు నడవనుందని అన్నారు.

మహిళల కోసం విశేషంగా కేటాయింపులు జరిగాయని.. జిల్లాకు ఒక బాలికల హాస్టల్.. చరిత్రాత్మక నిర్ణయం అని అన్నారు.

పౌర విమానయాన వ్యవస్థకు సైతం బలమైన భవిష్యత్ కు సూచనగా కేటాయింపులు జరిగినట్టు గుర్తు చేశారు. ఏభై రోజులకు ఒక ఎయిర్పోర్ట్ చొప్పున్న నిర్మించుకుని వెళ్తున్నామని.. 2047 నాటికి 350 విమానాశ్రయాలను దేశంలో విస్తరిస్తామని అన్నారు. ఉడన్ పథకం ద్వారా.. ప్రాంతీయ కనెక్టివిటీ నీ మెరుగుపరిచామని.. విమాన విడిభాగాలపై పన్ను సడలింపు కారణంగా.. విమాన తయారీ రంగం కూడా భవిష్యత్లో బలంగా విస్తరిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. అదానీ – ఎంబ్రెర్ ఒప్పందం, రష్యన్ ఎస్.జే 100 ఒప్పందాలు.. తాజాగా పన్ను సడలింపు తో మరింత ప్రయోజనాన్ని పొందనున్నాయని అన్నారు.

సీ ప్లెయిన్ రంగానికి తాజా బడ్జెట్ లో కేటాయింపుల ద్వారా తీర ప్రాంతం అధికంగా ఉన్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్, లక్షద్వీప్ ప్రాంతాలు అధిక ప్రయోజనం చేకూరనుందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వాటి ఫలితాలను రాబట్టుతామని తెలిపారు. ఫ్లైట్ లీజింగ్ ఇండస్ట్రీస్ కి పన్ను సడలింపు ఇవ్వడం పెద్ద ఊరటగా నిలిచిందని.. అదనంగా అనేక విమానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు, రైల్వేలో అధిక కేటాయింపులు, పోలవరం..అమరావతికి తోడ్పాటు, గ్రామీణ ప్రాంత రోడ్లకు 500 కోట్లు, పట్టణ త్రాగునీరుకు 800 కోట్లు కేటాయింపు ద్వారా మరింత వేగంగా స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పోలవరం ను మళ్లీ గాడిలో పెట్టమని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నిలిపామని, రైల్వే జోన్ ను సాధించి.. అభివృద్ధికి హద్దులు చెరిపినట్టు గుర్తు చేశారు. 20 నెలల కూటమి విజయాలు.. ఇలానే ఇరవై సంవత్సరాలు కొనసాగాలని.. మొక్కను పెంచి.. కసాయి వాడి చేతిలో పెట్టడం సరికాదని అన్నారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో సరైన నాయకత్వం బాధ్యత తీసుకుందని.. ప్రజలు వారిని ఉడుము పట్టు పట్టి నాయకత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *