-8 మంది పని చేయాల్సిన చోట 31 మందితో పని చేయించారు
-భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు కఠినతరం చేస్తాం
-కాకినాడ జీజీహెచ్ లో వేట్లపాలెం పేలుడు ప్రమాద బాధిత క్షతగాత్రులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్లోపేలుడు ప్రమాదానికి కారణమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమితికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని తెలిపారు. 8 మంది పని చేసేందుకు అనుమతి ఉన్న ప్రదేశంలో 31 మంది చేత పని చేయిస్తుండడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్ లో వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ…
• సామర్లకోట మండలం, వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్ లో జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. అనుమతులు తీసుకున్న మేరకు యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. ఇలాంటి సంఘటనలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ఇక్కడికి వచ్చే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో చర్చించాం. నిబంధనలు మరింత కఠినతరం చేయడంపై చర్చించాం. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నాం. క్షతగాత్రులకు చికిత్సకయ్యే పూర్తి ఖర్చుల ప్రభుత్వమే భరిస్తుంది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్ తదితరులు పవన్ కళ్యాణ్ తో పాటు క్షతగాత్రులను పరామర్శించారు.
Prajavartha Online Telugu News