Breaking News

జనాభా భారం కాదు…భాగ్యం

-సంతాన సాఫల్య రేట్ 2.1కి పెంచడానికి ప్రణాళికలు
-ప్రభుత్వాసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్ల ఏర్పాటు
-మూడో సంతానానికి రూ.25 వేలు ప్రోత్సాహకం
-ఇద్దరికి మించి పిల్లల్ని కంటే ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు
-రాష్ట్రమంతటా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు, చైల్డ్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్స్
-ప్రతీ నెల నాలుగో శనివారం పాపులేషన్ కేర్ పై ప్రత్యేక కార్యక్రమం
-ఈ నెలాఖరు వరకు కొత్త పాలసీపై ప్రజాభిప్రాయ సేకరణ
-మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని పేరుతో ఫైవ్ పిల్లర్స్
-జనాభా వృద్ధికి దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో నూతన విధానం
-శాసన సభలో ‘పాపులేషన్ మేనేజ్మెంట్‌’ ముసాయిదా పై ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇన్నాళ్లూ ఫ్యామిలీ ప్లానింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చామని, ఇకపై ‘పాపులేషన్ కేర్’ పై దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జనాభా నిర్వహణ పై డ్రాఫ్ట్ పాలసీపై శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఏపీలో ప్రస్తుతం టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 1.5గా ఉందని, దీనిని 2.1కి పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని, భారతదేశంలోనూ, ముఖ్యంగా ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందని సీఎం అన్నారు. 1992-93లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఎఫ్ఆర్ 3.0గా ఉండేదని గుర్తు చేశారు. టీఎఫ్ఆర్ మరింత వేగంగా తగ్గితే వర్క్ ఫోర్స్ పడిపోతుందని… దీంతో ఆర్థిక వృద్ధి మందగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరింత నష్టం వాటిల్లుతుందనే ఆలోచనతో ఈ డ్రాఫ్ట్ పాలసీకి రూపకల్పన చేశామని వివరించారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో కేవలం ఏడాదికి 6.70 లక్షల జననాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2047 నాటికి రాష్ట్ర జనాభాలో 23 శాతం మంది వృద్ధులే ఉంటారని చెప్పారు. ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’ పాలసీ డాక్యుమెంట్ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లో పెడుతున్నట్టు సీఎం ప్రకటించారు. దీనిపై రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో నెల రోజుల పాటు ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఈ అంశంపై చర్చ నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతీ నెల నాలుగో శనివారం జనాభా నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీకి తుది రూపు ఇచ్చి, ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామన్నారు. ఏడాది తర్వాత ఫలితాలు పరిశీలించి పాలసీలో మార్పులు చేర్పులు చేస్తామని వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ అనేది పాపులేషన్ మేనేజ్‌మెంట్‌తోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని ఈ ఐదు పాపులేషన్ మేనేజ్‌మెంట్‌కు మూలస్తంభాలన్నారు.

మహిళల వర్క్ ఫోర్స్‌ పెరిగితే జీఎస్డీపీ వృద్ధి

ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘మహిళల వర్క్ ఫోర్స్ ప్రస్తుతం కేవలం 31 శాతం మాత్రమే ఉంది. ఇది 59 శాతాన్ని చేరుకుంటే రాష్ట్ర జీఎస్డీపీ 15 శాతం పెరుగుతుంది. గర్భధారణ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి జీవిత దశలోనూ ప్రభుత్వ మద్దతు ఉంటుంది. పిల్లలు లేక, ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతిస్తాం. మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వాసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు పీపీపీ విధానంలో అందిస్తాం. సిజేరియన్లు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే, ప్రస్తుతం 8.8 శాతం ఉన్న టీనేజ్ గర్భధారణలను 3 శాతం లోపు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 50 మంది చిన్నారులు, మహిళలు ఒక ప్రాంతంలో ఉంటే చైల్డ్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం. షి క్యాబ్‌లు అందుబాటులోకి తెస్తాం. విశాఖపట్నంలో రూ.172 కోట్లతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ నిర్మాణం చేపట్టాం. ఏ ప్రాంతంలో మహిళా ఉద్యోగులు పనిచేస్తారో అక్కడ కొత్తగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడో సంతానం, ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్ – తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం. మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ ఇస్తాం. మూడో సంతానానికి డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకంగా ఇవ్వడంతో పాటు 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం. త్వరలో ‘తల్లి దండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన క్యాంపెయిన్ చేపడతాం. చైల్డ్ కేర్టేకర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం.’ అన్నారు.

2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా 23 శాతం

‘2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా 23 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం. వృద్ధుల సంరక్షణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తాం. 175 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో రెండు వారాలకు ఒకసారి ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తాం. సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ ద్వారా 50,000 రిటైర్డ్ ప్రొఫెషనల్స్‌ను మెంటారింగ్‌లో భాగం చేస్తాం. రిటైర్‌మెంట్‌కు ముందే ఉద్యోగులకు 15 రోజుల వెల్‌నెస్ లీవ్, రూ.50,000 ఆరోగ్య నిధి కింద అందిస్తాం. వైద్య సేవలు అందించేందుకు డిజిటల్ మౌలిక వసతులు అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు డిజిటల్ నెర్వ్ సిస్టమ్ ప్రాజెక్ట్ సంజీవని నిలుస్తుంది. ఇది కుప్పంలో విజయవంతమైంది. త్వరలో రాష్ట్రమంతా అమలు చేస్తాం. ఈ ఏడాది జూలై నాటికి 5.2 కోట్ల ప్రజలను 2,086 ఆరోగ్య కేంద్రాల ద్వారా డిజిటల్ గా సంజీవని ప్రాజెక్టుతో అనుసంధానిస్తాం. రాష్ట్రంలో 71 లక్షల హై-రిస్క్ కేసులు గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.’ అని ముఖ్యమంత్రి అన్నారు.

సభ్యుల అభిప్రాయాలపై స్పందించిన సీఎం

పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ ప్రకటనపై శాసనసభలో సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మాల్తూషియన్ థీయరీ ఆఫ్ పాపులేషన్ పై గతంలో విస్తృత చర్చ జరిగేదని.. ప్రకృతి విపత్తులు, మహమ్మారులు వస్తే జనాభా నియంత్రణ జరుగుతుందని ఈ థియరీని ప్రతిపాదించినట్టు సీఎం చెప్పారు. 1996-97 సమయంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కోసం బ్రేక్ సైలెన్స్ అంటూ ప్రచారాలు నిర్వహించామని.. దాంతో రాష్ట్రంలో ఎయిడ్స్ పై నియంత్రణ సాధ్యమైందన్నారు. అలాగే, ఆర్ధిక సంస్కరణలు, సెల్ ఫోన్ లాంటి టెక్నాలజీ విప్లవం, ఫ్యామిలీ ప్లానింగ్ లాంటి అంశాలు ఎన్నో అమలు చేసి విజయం సాధించామన్నారు. మొదట్లో జనాభా నిర్వహణ గురించి మాట్లాడితే కొందరు విమర్శించారని, ఇప్పుడు అంతా జనాభా నిర్వహణ గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. దక్షిణ భారత దేశంలో జనాభా క్షీణత నమోదు అవుతోందని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. ఇప్పుడు ఒక్కరు వద్దు, ఇద్దరు ఒకే, ముగ్గురు ముద్దు అనే నినాదం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు.

దూరదృష్టితోనే పాపులేషన్ మేనేజ్‌మెంట్

‘పేదలు, గిరిజనులు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. కానీ ఏపీఎల్ కుటుంబాల్లో మాత్రం ఈ పరిస్థితి కనిపించటం లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇవ్వటం ద్వారా జనాభా నిర్వహణకు మద్దతిచ్చేలా చర్యలు ప్రారంభించాం. చైనా కేవలం ఒక్క సంతానంతో ఇప్పుడు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రపంచంలో మహిళలకు గౌరవం ఇచ్చే ఏకైక దేశం భారత్ మాత్రమే. ఎన్డీఏ ప్రభుత్వం చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించనుంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా దూరదృష్టితో ఆలోచన చేసే పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకువస్తున్నాం. మన సమాజంలో మైక్రో ఫ్యామిలీస్ అనే విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది. పెద్ద కుటుంబాలు కలిసి ఉండేలా ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందించేలా ఆలోచన చేస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందించేలా విధానాల్లో మార్పు తీసుకురావాలి. గతంలో జనాభా పెరిగితే ఏమవుతుందో అని ఆందోళన చెందాను. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా విధానాలు మార్చుకున్నాం. పూర్వం ఆస్తికంటే పిల్లలకే ఎక్కువ విలువ ఇచ్చే పరిస్థితి ఉండేది. టీనేజి ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాలు గతంలో జరిగేవి. ఇప్పుడు లేట్ మ్యారేజ్ వల్ల కూడా సంతాన లోపం జరుగుతోంది. ఇలాంటి సామాజిక అంశాలపై కూడా ప్రజాప్రతినిధులు విస్తృతంగా చర్చించాల్సి ఉంది. జనాభా తగ్గుతున్న పరిస్థితుల్లో నెలకొన్న ఈ సంక్షోభాన్ని ఓ అవకాశంగా తీసుకుని ప్రణాళికలు రూపొందించాలి.’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రజాభిప్రాయం మేరకే తుది పాలసీ

ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో సమాజంలో జీవితాలు అన్నీ యాంత్రికంగా మారిపోయాయి. యాంత్రిక జీవితంతోనే అసలు మానసిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఏపీ జనాభా 5 కోట్లకు తగ్గకుండా నిర్వహిస్తేనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా నిలుస్తుంది. ప్రజాహితం కోసం, ఆర్ధిక అసమానతలను తొలగించేలా నిర్ణయాలు తీసుకుందాం. అత్యున్నత జీవన ప్రమాణాల కోసం పునాది వేయబట్టే హైదరాబాద్ ఇప్పుడు అత్యుత్తమ నగరంగా ఎదిగింది. ఇప్పుడు ప్రణాళికలు చేస్తేనే వచ్చే 30 నుంచి 40 ఏళ్లలో సమాజంలో సుస్థిరత, సంపద, సమృద్ధి చేకూరతాయి. పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై ప్రజాభిప్రాయం ఆధారంగా ముందుకు వెళ్తాం. ఈ పాలసీపై చట్ట సభలో తీసుకున్న ఈ సంకల్పం చిర స్థాయిగా నిలిచిపోతుంది. ప్రజలు కూడా ఈ సంకల్పాన్ని అర్ధం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అని ముఖ్యమంత్రి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *