-ఈ నెల 11, 12వ తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్సులో దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి
-సమావేశాల రెండో రోజున శాంతి భద్రతలపై సమీక్ష… హాజరుకానున్న జిల్లాల ఎస్పీలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర అభివృద్ధి దిశగా పని చేస్తోన్న అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసేలా ఈ నెల 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జీఎస్డీపీ గ్రోత్, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పన, శాంతిభద్రతలపై సమగ్రంగా చర్చించనున్నారు. కాన్ఫరెన్స్ మొదటి రోజు ఉదయం 10 గంటలకు CCLA స్వాగత ప్రసంగంతో ప్రారంభమవుతుంది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కీనోట్ అడ్రస్ ఇవ్వనున్నారు. అనంతరం వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. స్వర్ణాంధ్ర @2047 – పది సూత్రాల అమల్లో భాగంగా పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, జల భద్రత, వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వంటి అంశాలపై చర్చించున్నారు. రాష్ట్ర GSDP, జిల్లాల వారీగా సాధించిన లక్ష్యాలపై సమీక్షిస్తారు. ఇక డిజిటల్ గవర్నెన్సులో భాగంగా ఈ-ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, డేటా డ్రివెన్ గవర్నెన్స్, పెట్టుబడి ప్రతిపాదనల గ్రౌండింగ్‌పై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సు రెండో రోజున ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలపై ప్రత్యేక సమావేశంలో కీలక చర్చ జరగనుంది. దీంతో సూపర్ సిక్స్ పథకాల అమలు తీరు, మధ్యాహ్న భోజన పథకం, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపడతారు. అలాగే భూ పరిపాలన, రెవెన్యూ ఆర్జన శాఖల పనితీరుతో పాటు విద్య, ఉపాధి అవకాశాల కల్పనపై చర్చలు జరగనున్నాయి. రెండో రోజు సాయంత్రం వేళ రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ప్రత్యేక సెషన్ ఉంటుంది. ఈ సెషనులో జిల్లా ఎస్పీలు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై డీజీపీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ రెండు రోజుల సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, హెచ్వోడీలు పాల్గొననున్నారు.
Prajavartha Online Telugu News