Breaking News

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

-త్వరలో టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్
-వచ్చే 10 ఏళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం
-గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
-రాష్ట్రంలో 3 ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు అధికారుల ప్రతిపాదన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఇందుకు రాష్ట్రంలో బీచ్ సాండ్ వంటి మినరల్స్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ‘ఆంధ్రప్రదేశ్ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ (AP-TSMM)’ రూపకల్పన, పెట్టుబడులు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ మిషన్ ద్వారా భారీగా పెట్టుబడులు ఆకట్టుకోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం అన్నారు. ఇది రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతంగా నిలుస్తుందన్నారు. ఈ మిషన్ ద్వారా వచ్చే పదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు, 40,000 ఉద్యోగాల సాధనే లక్ష్యం కావాలన్నారు. రేర్ మినరల్స్ విషయంలో కేంద్రం, మిగిలిన రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, వాల్యూ ఎడిషన్‌ పైనా మరింత అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. వనరుల సద్వినియోగం చేసుకోవాలంటే వాటిపై అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్‌ డిమాండ్‌కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలన్నారు.

రాష్ట్రంలో విలువైన బీచ్ సాండ్ మినరల్స్

రాష్ట్రంలోని తీరప్రాంతంలో లభించే బీచ్ సాండ్ మినరల్స్ దేశంలోనే అత్యంత విలువైనవని, వీటిలో ప్రధానంగా ఇల్మెనైట్, రుటైల్, జిర్కాన్, మోనాజైట్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బీచ్ సాండ్ మినరల్స్ ఉత్పత్తులు పెయింట్స్, కాస్మెటిక్స్, ఔషధ పరిశ్రమ, ఏరోస్పేస్, రక్షణ రంగం, శస్త్రచికిత్స, సెరామిక్స్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధనం, అణు రియాక్టర్ భాగాల వంటి కీలక పరిశ్రమలకు అవసరం అవుతాయని వివరించారు. రాష్ట్రంలో లభిస్తున్న మినరల్స్‌ను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు మూడు ముఖ్యమైన ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులు ఈ సందర్భంగా ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందుంచారు. అందులో ఒకటి శ్రీకాకుళంలో టైటానియం పార్క్, సంవత్సరానికి 15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం. రెండవది అనకాపల్లిలో రేర్ ఎర్త్ కారిడార్, సంవత్సరానికి 25,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యం. మూడవది మచిలీపట్నంలో సమగ్ర టైటానియం, రేర్ ఎర్త్ కారిడార్‌. ఈ సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, మైనింగ్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *