-కరవు నేల జలసిరులు కురిపించిన కలెక్టర్
-జిల్లాలో అంతర్గత కాలువల అనుసంధానం
-వట్టిపోయిన చెరువులకు జలకళ
-5 నెలల్లో 8.59 మీటర్ల భూగర్భజల మట్టం పెరుగుదల
– కలెక్టర్ల సదస్సులో ఆదర్శపాఠంగా నిలిచిన అన్నమయ్య జిల్లా భగీరథ ప్రయత్నం
-పులకించిన ముఖ్యమంత్రి
-రాష్ట్రమంతటా జలధార అమలుకు ఆదేశం
-కలెక్టర్ నిశాంత్ కుమార్కు సీఎం ప్రశంసల జల్లు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నమయ్య జిల్లా.. సీమ కరువు జిల్లాలో అత్యంత కరువు ప్రభావిత జిల్లాల్లో ఒక్కటి. వార్షిక వర్షపాతం 743 సెంటీమీటర్లే. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. అలాంటి కరవు నేలపై ఆ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కు ప్రధానంగా పలుకరించిన సమస్య నీటి సమస్య. ఈ సమస్యకు ఎలాగైనా చరమగీతం పాడాలని కలెక్టర్ వినూత్నంగా ఆలోచించారు. ఇది కరవు ప్రాంతమే అయినప్పటికీ ఉన్న నీటి వననరులు ఎందుకు పనికిరాకుండాపోయాయి అని ఆలోచించారు. జిల్లాలోని చెరువులు, కుంటులకు నీటి ప్రవాహాన్ని తీసుకొచ్చే కాలువలు కొన్ని చోట్ల పూడిపోవడం, కొన్ని చోట్ల పాడైపోవడం లాంటివి ఉన్నాయి. అంతేకాదు ఏ కాలువకు ఆ కాలువ విడిగా ఉండిపోయాయి. చెరువకు చెరువుకు మధ్య కాలువలకు కాలువలకు మధ్య అనుసధానం లేకపోవడంతో వర్షం పడినా నీరు వృథాగా నేలపాలై, జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొంటున్న విషయాన్ని గమనించారు. జిల్లాలోని అన్ని నీటి ప్రవాహ కాలువలను అంతర్గతంగా అనుసంధాన కార్యక్రమానికి నడుంబిగించారు. యంత్రాంగాన్ని సమైఖ్యంగా ముందకు నడిపించారు. గ్రామాల్లో ప్రజలను కలిసి వారి భాగస్వామ్యం,వారికున్న స్థానిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, అధికారులు, ప్రజలు మమేకమై యుద్ద ప్రాతిపదికన కాలువల అనుసంధానం చేశారు. ఆయా ఊర్లో అక్కడి చెరువు ఎందుకు ఎండిపోయింది, గతంలో ఆ చెరువుకు ఎక్కడి నుంచి నీళ్లు వచ్చేవి, ఇప్పుడు ఎందుఎకు రాలేదు అనేది స్థానికుల నుంచే సమాచారం తెలుసుకున్నారు. స్థానికులు, అధికారుల సహకారంతో ఆ చెరువకు గతంలో లాగా నీటి ప్రవాహం వచ్చి చేరేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి మండలానికి ఒక అధికారిని బాధ్యులుగా నియమించి ఆ మండలంలో నీటి వనరుల సద్వినియోగం చేసుకునే బాధ్తలను ఆ అధికారికి కట్టబెట్టారు. ప్రతి కుంటకు నీరు వచ్చి చేరేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. ఫలితంగా చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరుండేలా సాధించడంలో జిల్లా యంత్రాంగం విజయం సాధించింది. ఈ భగీరథ ప్రయత్నానికి జలధార అని పేరు పెట్టి యంత్రాంగం ముందుకు వెళ్లింది. అధికారులు, ప్రజలు అందరూ భాగస్వామ్యమై, శాఖలమధ్య అనుసంధానం సమన్వయంతో విజయవంతంగా చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో నీరులేని చెరువు కుంటలు లేని స్థితి సాధించారు. జిల్లా యంత్రాంగం చేసిన ప్రయత్నాలకు మొంథా తుపాను కూడా కలిసొచ్చింది. వీరు ముందుగానే ఈ పనులు చేసుకోవడంతో మొంథా తపానుతో వర్షపు నీరుతో కుంటలన్నీ నిండిపోయాయి.
అట్టడుగు నుంచి అగ్రస్థానానికి
నీటి నిర్వహణలో అట్టడుగున 25వ స్థానంలో ఉన్న అన్నమయ్య జిల్లా ఇప్పుడు జలధార కార్యక్రమంలో అగ్రస్థానాల్లోకి ఎగబాకింది. జలధార కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నిరుపయోగంగా మారిన జల వనరులు, కాలువలు, కుంటలను బాగు చేయడంతో నీటి లభ్యత పెరిగింది. ఫలితంగా జిల్లాలో భూగర్భజల మట్టాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2025 ఆగస్టులో 14.45 మీటర్ల మట్టంలో ఉన్న భూగర్బ జలాలు అదే ఏడాది డిసెంబరు నెలకు 5.86 మీటర్ల మట్టానికి చేరుకున్నాయి. భూగర్భ జలాల మట్టం పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. పచ్చదనం పెరిగింది. ఫలితంగా జిల్లా స్థూల విలువ జోడింపు (జీవీఏ) కూడా పెరిగింది.
రాష్ట్రమంతటా జలధార : సీఎం
అన్నమయ్య జిల్లా చేపట్టిన జలధార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో జలధార విజయగాథను జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా అధికారుల కృషి చూసి ముఖ్యమంత్రి పులకించిపోయారు. మంచి ప్రయత్నం చేశారు. ఎక్స్లెంట్, ఇదో క క్లియర్ కేస్ స్టడీ, దీన్ని అందరూ అందిపుచ్చుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అన్నమయ్య జిల్లా అత్యంత కరవు ప్రాంతాల్లో ఒకటని, అలాంటి చోట జిల్లా కలెక్టర్, అధికారులు వినూత్నంగా ఆలోచించి చేసిన చిన్న ప్రయత్నం పెద్ద ఫలితం ఇస్తోందని అభినందించారు. జలధారను అదే పేరుతో అడాప్ట్ చేసుకుంటున్నామని, రాష్ట్రమంతటా ఈ జలధార కార్యక్రమానికి అమలు చేస్తున్నట్లు సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. 90 రోజుల పాటు లేదా రాబోయే వర్షాకాలం వరకు అన్ని జిల్లాల్లో జలధార కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తద్వారా నీటిని సమర్థంగా నిర్వహించుకోగలుగుతామన్నారు. తాను పట్టిసీమ ప్రాజెక్టుద్వారా 100 టీఎంసీల నీరు కృష్ణా డెల్టా ప్రాంతాలకు తీసుకొచ్చానని, తద్వారా శ్రీశైలం నుంచి నీరు రాయలసీమకు మళ్లించడం వీలైందని, దాంతో రాయలసీమంలో రూపురేఖలే మారిపోతున్నాయని చెప్పారు. ఇదే తరహాలో అన్నయ్య జిల్లాలో స్థానికంగా ఉన్న కాలువల అనుసంధానం విజయవంతంగా, తక్కువ ఖర్చుతో చేయడం అభినందనీయమన్నారు.
Prajavartha Online Telugu News