-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు
-కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నెల్లూరు జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం పట్ల జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల రూపొందించిన ఈ వినూత్న విధానం ద్వారా గ్రామ స్థాయిలోనే భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
ఈ విధానంలో భాగంగా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఒక నెలలో నాలుగు విడతలుగా అధికారులు గ్రామానికి వెళ్లి ప్రజల భూ సమస్యలను పరిశీలించి పరిష్కారం చూపడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. భూ రికార్డులు, మ్యూటేషన్లు, సాదాబైనామా, డీకేటీ పట్టాలు, హౌస్ సైట్స్ వంటి అంశాలపై వస్తున్న ఫిర్యాదులను సమగ్రంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోంది.
ఇప్పటి వరకు భూ సమస్యల పరిష్కారంలో ప్రజలు పలుమార్లు కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి రావడం, సమస్యలు కోర్టులకు వెళ్లడం వంటి ఇబ్బందులను ఈ విధానం తగ్గిస్తుందని అధికారులు పేర్కొన్నారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి పరిష్కరించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామస్థాయిలోనే త్వరితగతిన సమస్యలకు పరిష్కారం లభిస్తోందని తెలిపారు.
ఇప్పటివరకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాలో మొత్తం 110 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, అందులో 26 గ్రామాల్లో భూ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. మిగిలిన గ్రామాల్లో కూడా సమస్యల పరిష్కారం దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ కార్యక్రమం ద్వారా భూ వివాదాలు తగ్గడంతో పాటు ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
గ్రామ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయదగిన మంచి మోడల్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయవచ్చని సీఎం సూచించారు.
Prajavartha Online Telugu News