-కౌలు రైతుల రుణాలకు నిబంధనలు అడ్డు కాకూడదు
-అవసరాలకు అనుగుణంగా స్వర్ణ గ్రామ-వార్డుల్లో సిబ్బంది సర్దుబాటు
-6వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమూల్ బ్రాండ్ తరహాలోనే డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన స్వయం బ్రాండ్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న 6వ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. తొలిరోజు చర్చలో భాగంగా వివిధ అంశాల్లో జరిగిన ప్రగతిని ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాల్లో కొన్ని కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”డ్వాక్రా, మెప్మాలోని స్వయం సహాయ సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం పేరిట బ్రాండింగ్ చేస్తున్నాం. దీని కోసం మహిళా దినోత్సవం రోజున లోగోను కూడా ఆవిష్కరించాం. మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో… డ్వాక్రా ఉత్పత్తులకూ అదే స్థాయిలో బ్రాండింగ్ తెచ్చేలా కృషి చేస్తున్నాం. అమూల్ తరహాలోనే సహకార విధానంలో ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ జరగాలి. అమూల్ పాడి రైతుల భాగస్వామ్యంతో నడుస్తోంది… స్వయంలో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం ఉంది. బిలియన్ డాలర్ల కంపెనీకి ఉన్నంత క్రెడిబులిటీ డ్వాక్రా మహిళలకు ఉంది. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలను తప్పకుండా తిరిగి చెల్లిస్తారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి.. ఆసక్తిగా ఉంటాయి. ఇంతటి క్రెడిబులిటీ ఉన్న డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. బ్రాండ్ లేకపోతే ఉత్పత్తి విలువ సగానికి తగ్గిపోతుంది. గ్లోబల్ మార్కెట్టుకు చేరేలా డ్వాక్రా ఉత్పత్తుల ప్రమాణాలు పెరగాలి. ఈ ఉత్పత్తులకు ట్రేసబిలిటి, సర్టిఫికేషన్ కూడా ఉండేలా చూడాలి. 28 జిల్లాలు… 28 బ్రాండ్లను రూపొందించి పోటీని పెంచాలి. స్వయం బ్రాండ్ ఎస్టాబ్లిష్ కావాలంటే నాణ్యతా ప్రమాణాలే అత్యంత కీలకం.” అని సీఎం వెల్లడించారు.
జిల్లా స్థాయిలో ఆర్టీజీఎస్ కేంద్రాలు
“జిల్లా స్థాయిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యోగుల పని తీరును విశ్లేషించుకోవాలి. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగానికీ కంప్యూటర్ అవగాహన తప్పనిసరి అర్హతగా చేర్చేలా సాధారణ పరిపాలన శాఖ చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లాల్లో హెచ్ఆర్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా సిబ్బంది ఉద్యోగుల సామర్ధ్యాలను పెంపొందించుకోవచ్చు. ప్రణాళికా విభాగం ఆన్ లైన్ కోర్సులు తీసుకువచ్చినా ప్రాక్టికల్ నాలెడ్జి వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. కౌలు రైతులకు రుణాలివ్వడానికి అడ్డంకిగా ఎలాంటి నిబంధనలు ఉండకూడదు. ఏమైనా నిబంధనలు ఉంటే వాటిపై చర్చించి తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయాన్ని రీఓరియంట్ చేయాలి. వ్యవసాయంతో పాటు… ఉద్యాన, పశుసంవర్ధక రంగాల వైపు రైతులు మళ్లాలి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల్లో మహిళా పోలీసుల సేవలను ఎవరూ వినియోగించుకోవటం లేదు. వారి సేవలను అవసరమున్న శాఖలు వినియోగించుకోవాలి. ఆర్ అండ్ బి, హెల్త్, మున్సిపల్ శాఖలకు ఎక్కువగా అవసరం ఉన్నట్టుగా చెబుతున్నారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లోని సిబ్బంది సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా.. ఆ మేరకు సర్దుబాటు చేసుకునేలా కలెక్టర్లకు అధికారాలిస్తున్నాం. స్వర్ణవార్డు, గ్రామ సిబ్బంది బదిలీలు సిఫార్సుల ఆధారంగా కాదు.. అవసరానికి అనుగుణంగానే జరగాలి.. రేషనలైజేషన్ ప్రకారమే ఈ బదిలీలు జరగాలి.”అని సీఎం ఆదేశించారు.
రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలి
“రైల్వే ప్రాజెక్టుల పరంగా నిధులకు సమస్య లేదు. ఇచ్చాపురం నుంచి చెన్నై వరకూ 4 లేన్ల మార్గం చేస్తున్నారు. అన్ని రైల్వే స్టేషన్లనూ ఆధునీకరించే ప్రక్రియను రైల్వే శాఖ చేపట్టింది. దీనిని అందిపుచ్చుకోవాలి. రైల్వే క్రాసింగ్స్ 1137కు పైగా ఉన్నాయి. ఇక్కడ ROB, RUBలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. లాజిస్టిక్స్ పార్కులను రైల్వే లైన్లకు అనుసంధానించండి. తక్కువ వ్యయంతో రవాణాకు ఆస్కారం ఉంది. పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. విద్యుత్ కొనుగోలు వ్యయంపై ప్రత్యేంగా ఫోకస్ పెట్టాలి. దేశంలో ఎక్కడా విద్యుత్ ఛార్జీలు తగ్గించిన పరిస్థితి లేదు.. కానీ మనం ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేశాం. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పించడంతోపాటు.. మిగతా వారికి స్పూర్తిని ఇచ్చేలా ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా బాధ్యత తీసుకుని విస్తృతంగా ప్రచారం చేపట్టాలి. నైపుణ్యం, కౌశలం పోర్టల్ ద్వారా ఉద్యోగాలు, నైపుణ్య కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి. యువతకు ఉద్యోగాలు, నైపుణ్యం కల్పించే విషయంలో ఒకే తరహా విధానాన్ని అనుసరించాలి. ఏఐ ట్యూటర్, ఏఐ డాక్టర్ వంటి అంశాలను కూడా ప్రాధాన్యతగా చేపట్టాలి. లాజిస్టిక్స్ డెవలప్మెంట్ పై ప్రధానంగా దృష్టి సారించాలి. లాజిస్టిక్స్ ప్రాజెక్టుల్లో భాగంగా పోర్టులు, ఎయిర్ పోర్టుల వద్ద పారిశ్రామిక టౌన్ షిప్‌లను అభివృద్ధి చేయాలి. ఎంఎస్ఎంఈ విధానం కింద లాజిస్టిక్స్ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఒక్కో జిల్లాలో 5 ఎకరాల్లో హెలీపోర్టులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి, కేంద్రం దీనికి నిధులు ఇస్తుంది. ఆయా జిల్లాల్లో ముఖ్యమైన పట్టణాలు, ప్రాంతాల్లో హెలీపోర్టులు ఏర్పాటు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.”అని సీఎం సూచించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల సాధనలో పోటీ పడాలి
“కాకినాడ, సామర్లకోటలో పర్యటించినప్పుడు రోడ్ల పక్కన చెత్త కనిపించింది. మున్సిపల్ కమిషనర్లు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను సాధించటంలో రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలు ఒకదానికి ఒకటి పోటీ పడాలి. శానిటేషన్ నిర్వహణపై ప్రజల్లో కూడా విస్తృత అవగాహన కల్పించాలి. ప్రమాణాలకు అనుగుణంగా పట్టణ, నగర ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా ప్రయత్నం చేయాలి. గ్రామాల్లోనూ పరిశుభ్రతపై అంతా దృష్టి సారించాలి. పరిశుభ్రంగా ఉండాలన్నది మన సంస్కృతిలో భాగం, ఆరోగ్య పరంగానూ శుభ్రత అనేది కీలకమైన అంశం. స్మార్ట్ హెల్త్ కేర్, వ్యవసాయంలో సాంకేతికత, విద్య, డిజిటల్ గవర్నెన్సు రంగాల్లో డీప్ టెక్ వినియోగం పెరగాలి. ఏఐ, బ్లాక్ చైన్, ఐఓటీ, రోబోటిక్స్ లాంటి టెక్నాలజీల వినియోగాన్ని పెంచితే వేగంగా, తక్కువ వ్యయంతోనే ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో సాంకేతికత వినియోగం పెరగాలి. అగ్రిటెక్ సహా ఏఐ అగ్రానమిస్ట్ అంశాన్ని ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో ప్రతీ ఇంటింటికీ తీసుకెళ్లాలి. రైతన్నా మీకోసం కార్యక్రమం ప్రతీ నెలలో 16, 17, 18, 23, 24, 25 తేదీల్లో చేపట్టాలి. పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు ప్రోత్సాహకంగా రైతులకు ఉచితంగా నానో యూరియా ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలి. రైతులకు నానో యూరియా ఉచిత సరఫరాపై కేంద్రంతో సంప్రదింపులు జరపాలి”అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News