బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా కాకినాడలో మెప్మా అవగాహన కార్యక్రమాలు

-ఆరోగ్యకరమైన జీవనశైలి, విద్యుత్ పొదుపు, జల సంరక్షణపై మహిళా సంఘాలకు అవగాహన

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బ్రిక్స్ (BRICS) సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ప్రతిరోజూ ఒక ప్రత్యేక అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, మొదటి మూడు రోజుల పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, విద్యుత్ పొదుపు, జల సంరక్షణ అంశాలపై కార్యక్రమాలు చేపట్టారు.
మొదటి రోజు – ఆరోగ్యకరమైన జీవనశైలి:
ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను తెలియజేస్తూ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో యోగా, వాకథాన్ కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, మిద్దె తోటల పెంపకం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
రెండవ రోజు – విద్యుత్ పొదుపు:
విద్యుత్ వినియోగాన్ని తగ్గించి ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. సంప్రదాయ బల్బులకు బదులుగా ఎల్‌ఈడీ బల్బులను వినియోగించాలని, అవసరం లేనప్పుడు విద్యుత్ పరికరాలను నిలిపివేయాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు.
మూడవ రోజు – జల సంరక్షణ:
నీటి వనరులను కాపాడుకోవడం, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించడం, నీటి లీకేజీలను అరికట్టడం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకుని వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని సూచించారు.
ఈ మూడు రోజుల కార్యక్రమాల ద్వారా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆరోగ్యకరమైన జీవనశైలి, విద్యుత్ పొదుపు, జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాల్లో సిటీ మిషన్ మేనేజర్ డి. వెంకట్రాజు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీఓలు), రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు), మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.