ప్రజాక్షేత్రంలోనూ.. న్యాయస్థానాల్లోనూ వైసీపీకి భంగపాటు

Devineni uma

-ఓటమి భయంతోనే నామినేషన్ పత్రాలు చించి.. దాడులు, హింసాత్మక చర్యలతో డ్రామాలు
-పట్టిసీమ నీళ్ళు తాగుతూ చంద్రబాబుపై విషం చిమ్ముతున్నాడు
-అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ లక్ష్యం స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం
-మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంటే, వైసీపీ అధినేత జగన్ తన సొంత జిల్లా కడపలోనే దౌర్జన్యాలు, దాడులతో అరాచకాలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నామినేషన్ పత్రాలను చింపుకుని, పోలీసులపై, మహిళా కానిస్టేబుళ్లపై దాడులకు దిగడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.

‘వై నాట్ 175’ అన్న జగన్‌ను ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఆయన తీరు మారలేదన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వందలాది కేసులు వేసినా, మంత్రి నారా లోకేష్ పట్టుదలతో 16 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ, సుప్రీంకోర్టు తీర్పులను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి కడప జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లోనే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, దర్శిలో మహిళా కానిస్టేబుల్‌తో పాటు పోలీసులపై దాడులు జరిగినట్లు ఆధారాలు వెల్లడయ్యాయని ఉమా అన్నారు. ప్రజలు తిరస్కరిస్తారనే భయంతోనే వైసీపీ ఈ నాటకాలకు తెరతీసిందని విమర్శించారు.

చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పోలవరం, అమరావతి నిర్మాణాలను వేగవంతం చేస్తూ, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఉమా తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి రైతులకు అండగా నిలిచారని, పురుషోత్తపట్నం ద్వారా విశాఖ తాగునీటి అవసరాలను తీర్చారని వివరించారు. పట్టిసీమ దండగ అని నాడు విమర్శించి నేడు ప్రయోజనాలను పొందుతూ పట్టిసీమ నీళ్లు తాగుతున్న జగన్ చంద్రబాబు పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు.

ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి వంటి పథకాలతో ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. విద్యావంతులు, మహిళలు, బీసీలకు కూటమి ప్రాధాన్యం కల్పించిందని ఉమా పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. దౌర్జన్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకుని ధైర్యముంటే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగాలని జగన్‌కు సవాల్ విసిరారు.