-యుద్ధ నౌకలు, హెలికాప్టర్ల సహాయంతో నిరంతరంగాకొనసాగుతున్న గాలింపు చర్యలు: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కాకినాడ జిల్లా ఉప్పాడ మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు ఈ నెల 19వ తేదీ సాయంత్రం జిల్లా యంత్రాంగానికి సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కోస్ట్‌గార్డ్ అధికారులకు తెలియజేసిందని కలెక్టర్ పేర్కొన్నారు.
కోస్ట్‌గార్డ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు అందిన సమాచారం మేరకు, గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 18వ తేదీన ఒడిశాలోని పారాదీప్ పోర్టు సమీపంలో కనిపించినట్లు ప్రాథమికంగా గుర్తించారని తెలిపారు. ఆ తరువాత వారు ఫోన్ ద్వారా గానీ, ట్రాన్స్‌పాండర్ ద్వారా గానీ ఎలాంటి సమాచారం అందుబాటులోకి రాలేదని వివరించారు.
మత్స్యకారులు గల్లంతైనట్లు సమాచారం అందిన వెంటనే కాకినాడ కోస్ట్‌గార్డ్ అధికారులు తక్షణమే స్పందించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారని కలెక్టర్ తెలిపారు.
ఈ క్రమంలో ఒడిశా, చెన్నై కోస్ట్‌గార్డ్ కేంద్రాలకు సమాచారం అందించడంతో పాటు, సంబంధిత విభాగాల మధ్య సమన్వయం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనేందుకు కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులు సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
యుద్ధ నౌకలు, హెలికాప్టర్ల ను వినియోగిస్తూ సముద్రం లో నిరంతరాయంగా గాలింపు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బంగ్లాదేశ్, మయన్మార్ నేవీ అధికారులతో కూడా పంచుకున్నట్లు తెలిపారు.
గల్లంతైన మత్స్యకారులకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించడంతో పాటు,వారి చివరి కదలికలను గుర్తించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ వివరించారు.
అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా వివిధ నిఘా మరియు సమాచార వ్యవస్థల ద్వారా వారి ఆచూకీని గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వస్తారనే ఆశాభావాన్ని జిల్లా కలెక్టర్ వ్యక్తం చేశారు.
వారి ఆచూకీ లభించే వరకు సంబంధిత అధికారుల సమన్వయంతో గాలింపు చర్యలను కొనసాగించ నున్నట్లు తెలిపారు.
