-పలు జిల్లాలకు పిడుగులు, మెరుపులతో కూడిన వర్ష సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: APSDMA ఎండీ ప్రఖర్ జైన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు పిడుగులు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
గురువారం (నవంబర్ 26) పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడవచ్చని తెలిపారు. ఎల్లుండి రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 45.3 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా అల్లంపాడులో 41.5, గూడూరులో 32.7, తిరుపతి జిల్లా వాకాడులో 32.5, నెల్లూరు జిల్లా విడవలూరులో 32, తిరుపతి జిల్లా పెన్నేపల్లెలో 30, నెల్లూరు జిల్లా మొలకలపుండ్లలో 28, నెల్లూరులో 23.2, భీమవరంలో 22.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.
పిడుగులు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
