దసరా మహోత్సవాల్లో ఎన్ఎస్ఎస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలు అభినందనీయం

-10 రోజుల పాటు 850 మంది వాలంటీర్ల సేవలు – రూ.25.50 లక్షల విలువైన స్వచ్ఛంద మానవ వనరుల సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన దసరా మహోత్సవాల్లో ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పది రోజుల పాటు రాత్రింబవళ్లు భక్తులకు అంకితభావంతో సేవలందించారు. మొత్తం 750 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, 100 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు కలిపి 850 మంది యువత స్వచ్ఛందంగా పాల్గొని భక్తులకు సేవలందించడం అభినందనీయమని జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, జిల్లా టూరిజం అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు.

ఈ సేవా కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పీబీ సిద్ధార్థ కళాశాల, కేబీఎన్ కళాశాల, నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఆదిత్య డిగ్రీ కళాశాల (బాలుర, బాలికల క్యాంపస్‌లు), కేవీఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, విజయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎస్ఆర్‌కే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, పొట్టి శ్రీరాములు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎల్‌బీఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నిమ్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎంవీఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలకు చెందిన వాలంటీర్లు పాల్గొన్నారు.

వాలంటీర్లు భక్తుల క్యూలైన్ల నిర్వహణ, రద్దీ నియంత్రణ, వృద్ధులు, దివ్యాంగులకు సహాయం, వైద్య సేవలకు సహకారం, తాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీ, అన్నదాన కార్యక్రమాల్లో సేవలు, అమ్మవారి కుంకుమ ప్యాకింగ్ తదితర విధుల్లో చురుకుగా పాల్గొన్నారు. రాత్రి, పగలు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ వంతు సహకారం అందించారు.

ఈ సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాంజీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష, విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రావణి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం, సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లకు డాక్టర్ కొల్లేటి రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాలంటీర్లను ప్రోత్సహించి, అవసరమైన సహకారం అందించినందుకు వారిని అభినందించారు.

దసరా మహోత్సవాల విజయవంతమైన నిర్వహణలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ జి. లక్ష్మీశా, ఐఏఎస్ అందించిన ప్రోత్సాహం, సహకారం మరువలేనివని డాక్టర్ కొల్లేటి రమేష్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం మార్గదర్శకత్వంలో యువత ఇంత పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సేవలకు ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు.

రూ.25.50 లక్షల విలువైన స్వచ్ఛంద సేవలు

ఒక్కో వాలంటీర్ రోజుకు రూ.300 విలువైన మానవ వనరుల సేవలు అందించినట్లు అంచనా వేస్తే, 850 మంది వాలంటీర్లు పది రోజుల పాటు అందించిన సేవల మొత్తం విలువ రూ.25,50,000 (రూ.25.50 లక్షలు)గా ఉంటుందని తెలిపారు. ఈ సేవలు దేవస్థానానికి స్వచ్ఛంద మానవ వనరుల రూపంలో అందించిన విలువైన సహకారమని పేర్కొన్నారు.

“నాట్ మీ బట్ యూ” (నేను కాదు – నువ్వు) అనే జాతీయ సేవా పథకం నినాదానికి అనుగుణంగా యువత సమాజ సేవలో భాగస్వాములై, భక్తులకు అంకితభావంతో సేవలందించడం గర్వకారణం. ఈ పది రోజుల సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి వాలంటీర్‌కు, సహకరించిన కళాశాలల యాజమాన్యాలకు, ప్రిన్సిపాళ్లకు, ప్రోగ్రామ్ ఆఫీసర్లకు, అధికారులకు ఆయన హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.