మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల వ్యయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…

-జిల్లా వ్యయ పరిశీలకులు ఎం. శివ ప్రసాద్
-పరిమితి దాటితే చట్టపరమైన చర్యలు తప్పవు
-నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హత
-విజయవాడ కలెక్టరేట్‌లో వ్యయ పర్యవేక్షణ బృందాలతో సమీక్షా సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితులను కచ్చితంగా పాటించాలని జిల్లా వ్యయ పరిశీలకులు ఎం.శివ ప్రసాద్ స్పష్టం చేశారు.

బుధవారం విజయవాడ కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశతో కలిసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, జగ్గయ్యపేట, నందిగామ, కొండపల్లి, తిరువూరు ప్రాంతాల సహాయ వ్యయ పరిశీలకులు, వ్యయ పర్యవేక్షణ అకౌంటింగ్ బృందాలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లా వ్యయ పరిశీలకులు ఎం.శివ ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థికి గరిష్ఠంగా రూ. 25 లక్షలు, కార్పొరేటర్ (వార్డు సభ్యుల) అభ్యర్థులకు రూ.10 లక్షలు. మున్సిపాలిటీలు నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, కొండపల్లి చైర్‌పర్సన్ అభ్యర్థికి రూ. 20 లక్షలు, వార్డు సభ్యులకు రూ.7.50 లక్షలు.
నగర పంచాయతీలు చైర్‌పర్సన్ అభ్యర్థికి రూ. 10 లక్షలు, వార్డు సభ్యులకు రూ. 5 లక్షలు వ్యయ పరిమితులు ఉన్నాయని వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1955లోని సెక్షన్ 617-బి(1) మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నామినేషన్ వేసిన నాటి నుంచి తుది ఫలితాలు వచ్చే వరకు ప్రతిరోజూ ఖర్చులను సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. వాహనాలు, ర్యాలీలు, మైకులు, ప్రచార సామగ్రి (జెండాలు, టోపీలు), వార్తాపత్రిక ప్రకటనలు తదితర వ్యయాలను ప్రొఫార్మా-I, II, III, IVలలో పొందుపరచాలన్నారు. అభ్యర్థి మాత్రమే కాకుండా ఎన్నికల ఏజెంట్, పార్టీ లేదా ఇతరులు అభ్యర్థి తరఫున చేసిన ఖర్చులన్నీ అభ్యర్థి ఖాతాలోనే చేర్చబడతాయని స్పష్టం చేశారు. ఫలితాల ప్రకటనకు ముందే అభ్యర్థుల వ్యయ రిజిస్టర్లను వ్యయ పరిశీలకుల బృందం కనీసం మూడు పర్యాయాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తుందన్నారు. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు బిల్లులు, వోచర్లతో సహా సంబంధిత కమిషనర్ కార్యాలయంలో హాజరుకావాలన్నారు. తనిఖీల్లో లోపాలు బయటపడి నోటీసులు జారీ చేస్తే గడువులోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా, అంటే డిసెంబర్ 13, 2026 లోపు సహాయ వ్యయ పరిశీలకులకు తుది ఎన్నికల వ్యయ ఖాతాలను సమర్పించాలన్నారు. ఎన్నికల వ్యయ పరిమితులను ఉల్లంఘించినా లేదా నిర్దేశిత గడువులోగా తుది వ్యయ లెక్కలను సమర్పించకపోయినా అభ్యర్థులపై చట్టప్రకారం మూడేళ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు వేయడం జరుగుతుందని జిల్లా వ్యయ పరిశీలకులు ఎం. శివ ప్రసాద్ హెచ్చరించారు.

కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సహాయ వ్యయ పరిశీలకులు, వ్యయ పర్యవేక్షణ అకౌంటింగ్ బృందాల పాత్ర కీలకమన్నారు. వ్యయం లెక్కింపులో నిబంధనల మేరకు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఖర్చులు వివరాలను సంబంధిత రిజిస్టర్ ల నందు నమోదు చేసేలా పర్యవేక్షించాలన్నారు.