-ప్రతిభ కలిగిన రిజర్వుడ్ విద్యార్థులకు 1,213 ఓపెన్ కేటగిరీ సీట్లు
-రిజర్వుడు తరగతుల వారికి సీట్ల కేటాయింపు పై దుష్ప్రచారాన్ని ఖండించిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రస్తుతం జరుగుతున్న ఎంబిబియస్ ప్రవేశాల్లో మూడు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయ్యే నాటికి మొత్తం 4,581 కన్వీనర్ కోటా సీట్లలో 3,543 ( 77.34 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతులకు చెందిన విద్యార్థులకు కేటాయించినట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వెల్లడించింది. బుధవారంనాడు జారీ చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఎంబిబియస్ ప్రవేశాలకు సంబంధించి అవలంబించిన విధానాలను, కేటాయింపు వివరాలను విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయి సుధీర్ వివరించారు. రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులకు ఎంబిబియస్ సీట్ల కేటాయింపులపై కొందరు వ్యక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు.
ప్రతిభ ఆధారంగా రిజర్వుడు విద్యార్థులకు ఓసీ కేటగిరీ సీట్ల కేటాయింపులో పెరుగుదల
2026-27 విద్యా సంవత్సరంలో నీట్-యూజీ పరీక్ష ఆధారంగా జరుగుతున్న ఎంబిబియస్ ప్రవేశాల్లో ప్రతిభ కనబరచిన రిజర్వుడు విద్యార్థులకు ఓపెన్ కేటగిరీలో సీట్ల కేటాయింపులో భారీ పెరుగుదల ఉన్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. మూడు కౌన్సిలింగ్ ల అనంతరం ప్రస్తుత ఎంబిబియస్ ప్రవేశాల్లో ఓపెన్ కేటగిరిలోని మొత్తం 2,026 సీట్లలో 1,213( 59.87 శాతం) సీట్లు ప్రతిభ ఆధారంగా రిజర్వుడు వర్గాల వారికి కేటాయించడం జరిగింది. 2025-26లో ఈ సంఖ్య 981 (51.57 శాతం) గా మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జారీ అయిన జీఓ 102 మేరకు రిజర్వుడు తరగతుల వారికి ఎంబిబియస్ ప్రవేశాల్లో అన్యాయం జరుగుతున్నట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అది ఖండనీయమని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.
మెరిటోరియస్ రిజర్వుడు కేటగిరీ విద్యార్థులు ఓపెన్ కేటగిరిలో ప్రవేశాలు పొంది వదులుకున్న సీట్లను ఆయా రిజర్వుడు వర్గాలవారితోనే నియమాల మేరకు భర్తీ చేయాల్సి ఉంటుందని, ఆవిధంగానే చేయడం జరిగిందని రిజిస్ట్రార్ వివరించారు. దీనికి అదనంగా రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కింద ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఆప్షన్ల మేరకే ఎంఆర్సి సీట్ల కేటాయింపు
ఎంబిబియస్ ప్రవేశాల్లో రిజర్వుడు వర్గాల విద్యార్థులు సూచించిన వెబ్ ఆప్షన్ల మేరకే నిబంధనల ప్రకారం ప్రతిభ ఆధారిత సీట్ల కేటాయింపులు మెరిటోరియస్ రిజర్వుడు కేటగిరీ కింద జరుగుతాయని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు కూడా తెలియజేశామని ఆయన తెలిపారు. ఈ అంశం ఉన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉన్నా కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేయడం పట్ల రిజిస్ట్రార్ డాక్టర్ సాయి సుధీర్ తీవ్ర అభ్యంతరాన్ని వెలిబుచ్చారు.
ఎంతో ప్రతిష్ట కలిగిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం పూర్తిగా నియమ నిబంధనల మేరకు పకడ్బందిగా ప్రవేశాలు చేపడుతున్నా దురుద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం చేస్తూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల్లో ఆపోహలు కల్పించడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని, ఇకనైనా అట్టి ప్రయత్నాలను మానుకోవాలని రిజిస్ట్రార్ కోరారు.
