ముందస్తు గుర్తింపుతో రొమ్ము క్యాన్సర్‌ను జయించవచ్చు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రొమ్ము క్యాన్సర్ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి, సరైన వైద్య చికిత్స పొందితే ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రముఖ రేడియేషన్ క్యాన్సర్ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం. శ్రీదివ్య తెలిపారు. అక్టోబర్ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవం సందర్భంగా శుక్రవారం డాక్టర్ సమరం అధ్యక్షతన వాసవ్య నర్సింగ్ హోంలో నిర్వహించిన ఆరోగ్య సదస్సులో ఆమె రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.

రొమ్ములో కొత్తగా గడ్డ ఏర్పడటం, పరిమాణం లేదా ఆకారంలో మార్పులు, చనుమొన నుంచి అసాధారణ స్రావాలు, చర్మంలో మార్పులు, చంకలో వాపు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. నొప్పి లేకపోయినా క్యాన్సర్ ఉండే అవకాశం ఉందని, అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, అధిక బరువు నియంత్రణ, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చన్నారు. మామోగ్రఫీ వంటి పరీక్షలు ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తించడంలో ఉపయోగపడతాయని తెలిపారు.

శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ, హార్మోన్, టార్గెటెడ్ థెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. క్యాన్సర్ నిర్ధారణ అయినంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదని, సకాలంలో చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భరోసా ఇచ్చారు. సదస్సులో పాల్గొన్నవారు పలు ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.