-నష్టాల అంచనాలు, లబ్దిదారుల జాబితా సచివాలయాల్లో ప్రదర్శించాలి.
-తుపాన్ సమయంలో అందరూ బాగా పనిచేసారు.: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో తుఫాన్ నేపద్యంలో అధికారులు అందరూ బాగా పని చేశారు, నేటి సాయంత్రంతో వర్షాలు ఆగనున్నాయి, పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత, ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇఅని జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నుండి అన్ని డివిజన్, మండలాల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తుఫాన్ అనంతరం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేపట్టవలసిన సహాయక చర్యలు, అందించాల్సిన పరిహారాలు పై దిశానిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో పరిహారం అందించాలని సూచించారని ఆ మేరకు పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి ఒకరికైతే రూ.1000 , ఒక కుటుంబంలో ఇద్దరు ఆపై ఉన్నవారికి రూ. 2000 పరిహారం అందించాలని , అలాగే తుఫాన్ వల్ల ఇళ్లల్లో నీరు చేరిన ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి సూచించారని, ఆ మేరకు అర్హతగల వారికి తప్పనిసరి సహాయం అందాలని, ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు ఉండరాదని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి తుఫాన్ బారినపడిన మాకు సహాయం అందలేదనే మాట రాకూడదని, విజేలెన్స్ విచారణ ఉంటుదని సూచించారని అన్నారు.
పశుసంవర్థక శాఖ :
జిల్లాలో ఇప్పటివరకు పశువులు 7, దూడలు 9, గొర్రెలు 13 వరకు చనిపోయినట్టు ప్రాథమిక అంచనాలలో తెలిసిన మేరకు పరిహారం 24 గంటల లోపల అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆ మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. పశునష్టం మరోమారు తప్పనిసరి పరిశీలించాలని అన్నారు.
రెవెన్యూ యంత్రాంగం:
జిల్లాలో లో ఇప్పటివరకు 159 గృహాలు దెబ్బతిన్నాయనే అంచనాల మేరకు అందులో పూర్తిగా దెబ్బతిన్న వాటి వివరాలు, పాక్షికంగా దెబ్బతిన్న వివరాలు పరిహారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కచ్చితంగా జాబితా సంబంధిత సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని అని అన్నారు. ఈ జాబితాలో తప్పనిసరి తహసీల్దార్ల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
వ్యవసాయం:
వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, సిరికల్చర్ సంయుక్తంగా పంట నష్టాల అంచనాలను ఈనెల 14 నుండి 21 లోపల పూర్తిచేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశించి ఉన్నారని ఆ మేరకు పూర్తయిన జాబితా ఈ నెల 22 నుండి 26 వరకు సోషల్ ఆడిట్ జరపాలని ఆదేశించారు. ఈ మధ్యనే పంటలు వేసి తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు విత్తనాలను 80 శాతం సబ్సిడీతో అందించాలని గౌరవ ముఖ్యమంత్రి సూచించి ఉన్నారని ఆ మేరకు జాబితా సిద్ధం చేసి ఆ జాబితా కూడా సచివాలయంలో ప్రదర్శించాలని సూచించారు.
రహదారులు భవనాల శాఖ మరియు పంచాయతీ రాజ్ శాఖ:
తుఫాన్ వల్ల గ్రామాలకు రహదారులు లేకుండా పాడైన రోడ్లను వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించాలని అన్నారు. వీటితో పాటు శాశ్వతంగా నిర్మించాల్సిన దెబ్బతిన్న రోడ్ల అంచనాలను సిద్ధం చేయాల్సి ఉంటుందని సూచించారు. ఇప్పటివరకు ఒక గ్రామానికీ ఇబ్బంది అయిందని పునరుద్దరించామని అన్నారు.
ఎస్పీడీసీఎల్ :
విద్యుత్ శాఖకు సంబంధించి మరోసారి పరిశీలించి వర్షాల వల్ల ఏ గ్రామంలో కూడా విద్యుత్ లేదని సమాచారం రాకూడదని సూచించారు. ఇప్పటికే పునరుద్ధరించి విద్యుత్ అంతరాయం లేకుండా చేశామని సూచించారని మరోసారి గ్రామాలలో పరిశీలించి ఏదైనా పోల్స్ , ట్రాన్స్ ఫార్మర్లు మార్చవలసి ఉంటే తప్పనిసరి మార్చాల్సి ఉంటుందని సూచించారు.
నీటిపారుదల శాఖ:
ప్రస్తుతం తుఫాన్ వల్ల దాదాపు అన్ని ప్రాజెక్టులలో, చెరువులలో నీరు నిండి ఉన్నాయని ఏదైనా ఈ ప్రమాదం ఉందా లేదా అని పరిశీలించాలని, తాత్కాలిక చర్యలు చేపట్టాలని శాశ్వత పరిష్కారానికి అంచనాలు సిద్ధం చేయాలని వర్షాలు , నీటి ప్రవాహం ఆగే వరకు తప్పనిసరిగా పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ నేటి ఉదయం గౌరవ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ మేరకు ఇళ్లలో నీరు చేరి ఉంటే తప్పనిసరి నిత్యవసర వస్తువులు అందించాలని సూచించారని, ఇంతకు మునుపు మనం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 7 రోజుల పాటు నీళ్లు ఉంటేనే నిత్యవసర వస్తువులు అందించాలని అనుకున్నాం, కానీ మానవతా దృక్పథంతో ఒకరోజు ఇళ్ళలో నీరు చేరినా నిత్యవసర వస్తువులు అందించాలని సూచించారని ఇప్పటివరకు మనం ఈ రెండు, మూడు రోజులు వర్షంలో ఉన్న కుటుంబాల వివరాలను 2917 అని చూపించామని మరోసారి రెవెన్యూ యంత్రాంగం పరిశీలించాలని, ఇందులో ఎట్టి పరిస్థితుల్లో అనర్హుల జాబితా ఉండరాదని ఈ జాబితాను తప్పనిసరి సచివాలయాల్లో ప్రదర్శించాలని, వెంటనే వీరికి నిత్యవసర వస్తువులు అందించేలా చూడాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి నేటి ఉదయం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జిల్లాలో 17 మండలాల్లో 20 సెంటీమీటర్లు , మరో 17 మండలాల్లో 10 నుండి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అన్ని ప్రాజెక్టుల్లో నీరు నిండింది. నీటి ప్రవాహం పై పర్యవేక్షణ చేస్తున్నాం. దేవుడి దయతో ప్రాణ నష్టం లేదు , ఇప్పటి వరకు పశువులు 7 దూడలు 9 గొర్రెలు/మేకలు 13 చనిపోయాయి, గృహాలకు సంబంధించి 159 కొన్ని పూర్తిగా మరొకొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. పరిహారం అందిస్తున్నాం, పంట నష్ట అంచనాలు తమరి సూచనల మేరకు వారంలోపు పూర్తి చేయనున్నాం అని వివరించారు.
ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, జిల్లా పంచాయతీ అధికారి రాజశేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బి సుధాకర్ రెడ్డి , పంచాయతీ రాజ్ శంకర్ నారాయణ, ఆర్డబ్ల్యూఎస్ విజయ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, హార్టికల్చర్ అధికారి దశరధ రామిరెడ్డి , సిరికల్చర్ అధికారిని జిల్లా అధికారులు కలెక్టరేట్ నుండి పాల్గొనగా డివిజన్ స్థాయి ఆర్డీవోలు, మండల తహసీల్దార్ లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.