విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం సాయంత్రం రెండవ సాధారణ పురపాలక ఎన్నికలు–2026 నేపథ్యంలో నగర పరిధిలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా కుందావారి కంట్రీకలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చే ప్రజలకు అవసరమైన అష్యూర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్ (AMF) అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాలను కమిషనర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు, ర్యాంపులు, తాగునీటి సౌకర్యాలు తదితర కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చిన తీరును క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
దివ్యాంగులు, వృద్ధ ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ర్యాంపులు ఏర్పాటు చేయడం, పోలింగ్ కేంద్రాల్లో తగిన వెలుతురు, గాలి ప్రసరణ, తాగునీటి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలను పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను ముందస్తుగా సిద్ధం చేయడం ద్వారా ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మురళి గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
