-పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, ఇంచార్జ్ ఎస్పీడీ సమగ్ర శిక్ష ఎ. తమీమ్ అన్సారియా IAS
-అక్టోబరు 27 లోపు ఎకో క్లబ్ పోర్టల్ లో ఈ-వేస్ట్ కలెక్షన్ వివరాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ‘ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్’ ఆధ్వర్యంలో వివిధ ఆచరణాత్మక కార్యక్రమాలను చేపడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, ఇంచార్జ్ ఎస్పీడీ సమగ్ర శిక్ష ఎ. తమీమ్ అన్సారియా IAS., గారు ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం, అక్టోబర్ నెల అంతటా నిర్వహించిన ఇ-వేస్ట్ అవగాహన ప్రచారంలో భాగంగా అక్టోబర్ 28న అన్ని విద్యాసంస్థల్లో ‘ఇ-వేస్ట్ సేకరణ’ (Special Campaign 6) ముగింపు వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమ ముఖ్యాంశాలు – విధివిధానాలు
• ప్రత్యేక కార్యక్రమాలు: అక్టోబర్ 28న పాఠశాలల అసెంబ్లీలో ఇ-వేస్ట్ నిర్వహణ, పునరుపయోగం, బాధ్యతాయుతమైన పారవేతపై ప్రత్యేక క్విజ్ నిర్వహించి విద్యార్థులలో పర్యావరణ స్పృహ పెంపొందించాలి. అదే రోజు ప్రత్యేక లింక్ ద్వారా వెబ్ పోర్టల్‌లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ప్రధానోపాధ్యాయులు అప్ లోడ్ చేయాలి.
• ఇ-వేస్ట్ కలెక్షన్ కార్నర్లు: విద్యార్థులు తమ ఇళ్లలోని వినియోగించని లేదా పాడైపోయిన పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, కేబుల్స్, ఛార్జర్లు, పాత ఫోన్లు మొదలైన వ్యర్థాలను పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘ఇ-వేస్ట్ కలెక్షన్ కార్నర్ల’లోని బ్లాక్ బాక్సులలో సురక్షితంగా జమ చేయాలి.
• మండల కార్యాలయానికి చేరవేయడం: పాఠశాలలు సేకరించిన వ్యర్థాలను మండల ఆఫీసులో అప్పగించాల్సి ఉంటుంది. మండల విద్యాశాఖా కార్యాలయం నుంచి గుర్తింపు పొందిన రీసైక్లర్లు వీటిని సేకరిస్తారు.
• గుర్తింపు పొందిన రీసైక్లర్లకే అప్పగింత: పాఠశాలల్లో సేకరించిన ఇ-వేస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార స్క్రాప్ డీలర్లకు ఇవ్వకూడదు. అక్టోబర్ 27 నాటికే ఈ వ్యర్థాలను పర్యావరణ నియంత్రణ మండలి (CPCB/SPCB) చే గుర్తింపు పొందిన రీసైక్లర్లు/రిఫర్బిషర్లకు మాత్రమే అధికారికంగా అందజేయాలి. క్షేత్రస్థాయిలో రీసైక్లర్లను ఇప్పటికే గుర్తించి, వారి ఫోన్ నెంబర్లను కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది.
• భద్రతా నియమాలు: విద్యార్థులు లేదా సిబ్బంది బ్యాటరీలు, సీఆర్టీ (CRT) మానిటర్లు, ఎల్ఈడీ/సీఎఫ్ఎల్ బల్బులు తదితర ప్రమాదకర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయకూడదని కఠినమైన భద్రతా ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
• పోర్టల్ లో అప్లోడ్ గడువు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రాబోయే అక్టోబర్ 27వ తారీకు వరకు ఎకో క్లబ్ పోర్టల్ లో ఈ-వేస్ట్ కలెక్షన్ వివరాలను తప్పనిసరిగా సంబంధిత ఎకో కోఆర్డినేటర్ ద్వారా పోర్టల్ లో తప్పకుండా అప్లోడ్ చేయించేలా చర్యలు తీసుకోవాలి.
పాఠశాల విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పర్యావరణ స్పృహ, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎకో క్లబ్ కోఆర్డినేటర్లు అందరూ భాగస్వామ్యులై విజయవంతం చేయాలని కోరడమైనది.
