Breaking News

త్వరలో చుక్కల టీకా…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

కొవిడ్‌-19 నిరోధానికి ముక్కు ద్వారా తీసుకునేందుకు అనువైన చుక్కల టీకా అందుబాటులోకి రావడానికి మరో 6 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎండీ) సుచిత్ర ఎల్ల తెలిపారు. ఇప్పటికే ఈ టీకాపై మొదటి దశ పరీక్షలు పూర్తయ్యాయని, రెండు – మూడో దశ పరీక్షలు చేయడానికి 3-6 నెలలు అవసరమని పేర్కొన్నారు. మొదటి దశ ప్రయోగాల్లో ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా చుక్కల టీకా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలూ పని చేస్తున్నామన్నారు. ఆ టీకా వచ్చే వరకు ఎదురు చూడకుండా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు వేయించుకోవాలని ప్రజలకు ఆమె సూచించారు. ప్రస్తుత కొవాగ్జిన్‌ టీకాకు బూస్టర్‌ డోసు అవసరమా అనే అంశంపై ప్రయోగాలు జరగాల్సి ఉందని, ఒకవేళ కావాలని ఆరోగ్య సంస్థలు పేర్కొంటే, అప్పుడు ముక్కు ద్వారా టీకాను బూస్టర్‌ డోస్‌గా ప్రయత్నించవచ్చని తెలిపారు. మంగళవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) యంగ్‌ ఇండియన్స్‌ విభాగం ఏర్పాటు చేసిన దృశ్యమాధ్యమ సమావేశంలో సుచిత్ర ఎల్ల మాట్లాడారు. కొవాగ్జిన్‌ టీకా అభివృద్ధి, ఉత్పత్తిలో తాము చేస్తున్న కృషిని ఆమె వివరించారు. ఇనాక్టివేటెడ్‌ వైరస్‌ ప్లాట్‌ఫాం మీద తయారు చేసిన కొవాగ్జిన్‌ను సురక్షిత టీకాగా వివరించారు. టీకాల అభివృద్ధి, ఉత్పత్తిలో తమకున్న అనుభవం కొవిడ్‌ టీకాను సాధ్యమైనంత త్వరగా ఆవిష్కరించేందుకు ఉపయోగపడిందని వెల్లడించారు. ‘ఒక టీకాను ఆవిష్కరించేదకు వివిధ వయసుల వారి మీద, పలు దేశాల్లో కనీసం మూడు నుంచి నాలుగేళ్లపాటు పరీక్షలు జరుగుతుంటాయి. కానీ, కొవిడ్‌-19 తీవ్రత దృష్ట్యా ఈ పరీక్షలు వేగంగా నిర్వహించడంతో పాటు, త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. గత ఏడాది మార్చి 22 నుంచి టీకాను అందుబాటులోకి తెచ్చే వరకు మా ప్రయత్నాలకు ఒక్క నిమిషం కూడా విరామం ఇవ్వలేదు. ప్రభుత్వ పరంగానూ ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందాయి’ అని పేర్కొన్నారు. 18 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయసు వారి దాకా టీకా క్లినికల్‌ పరీక్షలు నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి దుష్పరిణామాలు నమోదు కాలేదని పేర్కొన్నారు. కొత్తగా వస్తున్న వైరస్‌ మ్యూటేషన్లనూ కొవాగ్జిన్‌ సమర్థంగా ఎదుర్కొంటుందని చెప్పారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *