Breaking News

స్వీయ గృహనిర్బంధం…

-స్వీయ గృహనిర్బంధం (HOME ISOLATION )

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

కొరోనా పాజిటివ్ అవగానే అందరికీ ఫోనులు చేసి బెంబేలెత్తి నన్నాసుపత్రిలో చేర్చండి అని ఏడ్చి కంగారు పడి సింపతీకొట్టకుండా.,ధైర్యంగా స్వీయ గృహనిర్బంధం ద్వారా కొరోనాను ఏవిధంగా ఎదుర్కోవాలనో తెలుసుకోండి.

జ్వరం, దగ్గు వంటి లక్షణాలు మొదలుకాగానే ఇంట్లో వాళ్ళకి నేను ఐసోలేషన్ కి వెళుతున్నా అని చెప్పి ఒక రూమ్ లోకి వెళ్ళాలి..అదేదో వనవాసం వెళుతున్నట్లు.. 300 రూపాయల మందుల కిట్టు మొదలెట్టాలి RTPCR పాజిటివ్ అవుతానే..

కొంచెం ధైర్యం కావాలంటే ఒక మంచి డాక్టర్ కి ఫోన్ చేసి కన్సల్టేషన్ తీసుకుని మందులు మొదలెట్టవచ్చు. ఆ రోజునుంచి ఇక పదిహేను రోజులు డాక్టర్ తో కాంటాక్ట్ లో ఉండాలి. అలాగని గంటగంటకు డాక్టరు మీద దాడి చేయరాదు. లైవ్ చాట్ చేయరాదు.. అలా చేస్తే సచ్చూరుకుంటాడు డాక్టరు , పోతే పోనీ దేశంకోసం ధర్మంకోసం పుణ్యంకోసం పోతే పోనీ అంటారా, సరే మీ ఇష్ఠం..ఆ డాక్టరు ఖర్మ…

ప్రతి రెండు గంటలకు ఏదో ఒకటి తింటుండాలి. అలా తిని ఇలా తిరిగి పడుకోవాలి. తినడం పడుకోవడం ఇంతకు మించి వేరే పని ఉండకూడదు. దగ్గొస్తే దగ్గాలి..తుమ్మొస్తే తుమ్మాలి. ఇంట్లో వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడవలసి వస్తే మాస్కు పెట్టుకుని మాట్లాడాలి. మూడు పూటలా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉండాలి.

నీళ్ళు బాగా తాగాలి. మజ్జిగ బాగా తీసుకుంటూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ బిస్కెట్లు గట్రా కరుంకరుంలాడించాలి. కాఫీలు టీలకు కాస్త దూరంగా ఉండాలి. ఇక మందు, పొగ..అబ్బబ్బే అసలెపుడూ వాటి ముఖం చూడనట్లే ఓవర్ యాక్షన్ చేయాలి.

దగ్గు జ్వరం ఎక్కువవుతుంటే డాక్టర్ కి చెప్పాలి. అవసరం ఐతే CT SCAN, D-డైమర్, CRP రక్త పరీక్షలు చెప్పవచ్చు చేయించుకోవాలి. వాటిలో తేడాలుంటే ఏవైనా మందులు మార్చవచ్చు. వేసుకోవాలి. మళ్ళీ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉండాలి.

ప్రతి మూడుగంటలకొకసారి పల్స్ ఆక్సిమీటర్ చూసుకుంటూ ఉండాలి పొద్దునపూట. 94 % పైన ఉంటే అసలు కంగరే లేదు. 94% వచ్చినా కంగారు లేదు. మందులు మారిస్తే మళ్ళీ కాస్త పెరుగుతుంది.

గుండె జబ్బులు లేని వారు అపుడపుడూ కాసేపు బోర్లా పడుకుంటూ ఉండాలి.

రెండవ వారంలో జ్వరం దగ్గు వంటివి పెరిగినా, ఆయాసం వంటివి వచ్చినా డాక్టర్ కి చెప్పాలి. నూటిలో ఒకరికి మాత్రమే ఇలా అయ్యే అవకాశం ఉంటుంది.

బుక్స్ చదువుకోవాలి. ఫ్రెండ్సుతో మధ్య మధ్య సొల్లు కబుర్లేసుకోవాలి. అదేపనిగా మాట్లాడితే ఆయాస మొస్తాది.. శాచురేషన్ పడిపోతాది,,జాగ్రత్త … కొరోనా మాటలు మాట్లాడి సింపతీ కొట్టకండి,,భయపడిచ్చి ఆస్పత్రిలో చేరమని దూల తీరుస్తారు.. యూట్యూబ్ లో ప్రాంక్ లూ కామెడీలు చూసుకోవాలి…. టీవీలు వార్తలు గట్రా చూడరాదు. వాటి బదులు హర్రర్ సినిమాలు చూసినా కాస్త నయం.

చలో..పదిహేను రోజులు కాగానే బయటకు వచ్చి
ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి..జుంబారే..జూజుంబరే.. జుంబరాహి జుంబరాహి జుంబారే..డాన్సు చేయాలి.

చివరి మాట…,., బాగవుతానే తిరుపతి కి పోయి గుండు కొట్టించుకొని వేలు ఖర్చు పెట్టుకొని ఆ దేవునికి ధన్యవాదాలు తెలిపేముందు, ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ కి కూడా ఓ పదో పరకో ఏయండయ్యా సామీ..అసలే మారటోరియం కూడా లేదంట ఈసారి.

Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

Check Also

సమాజ సేవలో స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్యం కావాలి

-కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *