– మహిళలకు ఎగుమతి మార్కెటింగ్‌పై ప్రత్యేక శిక్షణ
– జాతీయ సరస్ మేళా వేదికగా సాధికారతకు సరికొత్త ముందడుగు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘దీన్‌దయాల్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో స్వయం సహాయక సంఘాల హిళల కోసం ఎగుమతి మార్కెటింగ్‌పై శనివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్) ఢిల్లీ శాఖకు చెందిన మార్కెటింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీ ఉత్పత్తుల ఎగుమతి మార్కెటింగ్: సవాళ్లు – అవకాశాలు అనే అంశంపై ఈ శిక్షణ జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 90 మంది ఎస్.హెచ్.జీ దీదీలు, 35 మంది రాష్ట్ర నోడల్ అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎగుమతి మార్కెటింగ్ నిపుణులు చింతలపూడి మల్లేశ్వరరావు రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించి శిక్షణనిచ్చారు. అలాగే ఎన్ఐఆర్‌డీపీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ చిరంజీ లాల్ కటారియా, రీసెర్చ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ సింగ్, ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్ నేషనల్ మిషన్ మేనేజర్ రాజీవ్ సింఘాల్, ఏపీ సెర్ప్ డైరెక్టర్ డాక్టర్ శివశంకర్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చల్లో ఎస్.హెచ్.జీ మహిళలు తాము ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సవాళ్లను పంచుకోవడంతో పాటు, అంతర్జాతీయ కొనుగోలుదారులను గుర్తించడం, దళారుల ప్రమేయాన్ని తగ్గించడం, నాణ్యతను కాపాడుకోవడం వంటి అంశాలపై చర్చించారు. ప్రత్యేకించి ప్యాకేజింగ్, బ్రాండింగ్, అవసరమైన రిజిస్ట్రేషన్లు, ధృవీకరణ పత్రాలు, ఎగుమతి డాక్యుమెంటేషన్, లాజిస్టిక్స్ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. సేంద్రియ ఉత్పత్తులు, చిరుధాన్యాల ఆహారాలు, సుగంధ ద్రవ్యాలు, చేనేత వస్త్రాలు, హస్తకళల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అపారమైన అవకాశాలను ఈ శిక్షణ నొక్కి చెప్పింది. సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ట్రేడ్ ఫేర్లు, ఎస్.హెచ్.జీ ఫెడరేషన్ల ద్వారా సామూహిక మార్కెటింగ్ వంటి విభిన్న మార్గాల ద్వారా కొనుగోలుదారులను ఎలా చేరుకోవాలో వివరించారు. సామర్థ్య పెంపు, డిజిటల్ మార్కెటింగ్, స్థిరమైన మార్కెట్ అనుసంధానం ద్వారా మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఈ కార్యక్రమం నిరూపించింది. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
