రాజధాని అమరావతి రైతులకు 14 రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేత

WhatsApp Image 2026 10 24 at 4.50.53 PM

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన 14 మంది రైతులకు శనివారం 2026 అక్టోబర్ 24న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ- లాటరీ విధానం ద్వారా 14 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారు ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు అందజేశారు. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ(NSP) అమలులో భాగంగా భూములు కోల్పోయిన ఉండవల్లి గ్రామానికి చెందిన పన్నెండు మంది రైతులకు 12 రెసిడెన్షియల్ ప్లాట్లను, అలాగే రాజధాని నిర్మాణానికి ఇటీవల భూములిచ్చిన కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు 2 కమర్షియల్ ప్లాట్లను కేటాయించారు.

రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారు కోరారు. ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగా వారికి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్(ల్యాండ్స్) కె.ఎస్.భాగ్యరేఖ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఏ.జి.చిన్నికృష్ణ, కె.సుధారాణి, ప్లానింగ్ విభాగ జోనల్ జాయింట్ డైరెక్టర్ సిహెచ్. మధుసూధనరావు, IT, ప్లానింగ్, GIS, కమ్యూనికేషన్స్ విభాగ సిబ్బంది పాల్గొన్నారు.