-ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో హెచ్ఎల్ఈఏజీకి అనుసంధానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అంతర్జాతీయ ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుల సలహా బృందం (HLEAG) సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసింది. అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ–ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య సమాచారం–గణాంకాల నిర్వహణ, వైద్య సిబ్బంది నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఈ బృందాలు దృష్టి సారిస్తాయి. నిపుణుల సూచనలకు అనుగుణంగా వైద్య కార్యక్రమాలను మెరుగుపరచడం, శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టడం వీటి ప్రధాన లక్ష్యం. ‘స్వర్ణాంధ్ర–2047’ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజారోగ్య సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
రాష్ట్ర ఆరోగ్య రంగానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం, సాంకేతిక నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు హెచ్ఎల్ఈఏజీని ఏర్పాటు చేశారు. తల్లీబిడ్డల ఆరోగ్యం, అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు, ఆరోగ్య పరిరక్షణపై ఈ బృందం సూచనలు అందిస్తుంది. ఈ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ సంచాలకులు కె.వి.ఎన్. చక్రధర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
1. అంటువ్యాధుల నియంత్రణ
అంతర్జాతీయ నిపుణుల ఉపకమిటీ: పీటర్ పియోట్, గగన్‌దీప్ కాంగ్, ఆరోగ్య శాఖ కమిషనర్ సభ్యులుగా ఉన్నారు.
కార్యాచరణ బృందం: ప్రజారోగ్య సంచాలకులు ఆర్. వెంకటరమణ నేతృత్వం వహిస్తున్నారు. క్షయ నియంత్రణ, వ్యాధుల పర్యవేక్షణ, శ్వాసకోశ వైద్యం, సామాజిక వైద్యం, సూక్ష్మజీవ శాస్త్ర నిపుణులు, వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, సంబంధిత అధికారులు ఇందులో ఉన్నారు.
2. దీర్ఘకాలిక వ్యాధులు–ఆరోగ్య పరీక్షలు
అంతర్జాతీయ నిపుణుల ఉపకమిటీ: సౌమ్య స్వామినాథన్, నిఖిల్ టాండన్, నాగేశ్వర్‌రెడ్డి, ఎన్టీఆర్ వైద్యసేవల ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణ అధికారి సభ్యులుగా ఉన్నారు.
కార్యాచరణ బృందం: వైద్య, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి కె. శ్యామల నేతృత్వంలో నాడీ, గుండె, మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్, జీర్ణకోశ వైద్య నిపుణులు, NPCDCS, NOHP, RBSK, RKSK కార్యక్రమాల అధికారులు, ఇతర శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.
3. ఆరోగ్య సమాచారం–గణాంకాలు, సంజీవని
అంతర్జాతీయ నిపుణుల ఉపకమిటీ: రిజ్వాన్ కోయిటా, శ్రీకాంత్ నాదముని, వై.వై. టియో, APSACS ప్రాజెక్టు డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు.
కార్యాచరణ బృందం: సీనియర్ అధికారి బి.వి. రావు నేతృత్వంలో ఆరోగ్య సాంకేతికత, డిజిటల్ సేవలు, గణాంకాలు, పర్యవేక్షణ నిపుణులు, NHM, DEMO, CATH, DDVS, PATH, DSH, ఎన్టీఆర్ వైద్యసేవల ట్రస్టు అధికారులు, కన్సల్టెంట్లు సభ్యులుగా ఉన్నారు.
4. వైద్య సిబ్బంది నైపుణ్యాభివృద్ధి
అంతర్జాతీయ నిపుణుల ఉపకమిటీ: ఆర్తి అహుజా, మార్గరెట్ క్రుక్, వైద్య విద్య సంచాలకులు, ప్రజారోగ్య–కుటుంబ సంక్షేమ సంచాలకులు సభ్యులుగా ఉన్నారు. జె. విజయలక్ష్మి నేతృత్వంలో ఏర్పడిన కార్యాచరణ బృందంలో వైద్య విద్య, ప్రజారోగ్యం, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య సేవలు, ఆయుష్, అత్యవసర వైద్యం, శిక్షణ రంగాల నిపుణులు, NHM, NUHM, DME, DPHFW, DSH అధికారులతో పాటు ఇతర సంబంధిత ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.
