ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణతలో ప్రభుత్వ వైద్య కళాశాలల ముందంజ

-2025–26లో ప్రభుత్వ కళాశాలల్లో 88.11 శాతం.. ప్రైవేటు కళాశాలల్లో 80.68 శాతం ఉత్తీర్ణత
-ప్రభుత్వ సిద్ధార్థ, ఆంధ్ర వైద్య కళాశాలలు, తిరుపతి, పాడేరు కళాశాలల్లో మెరుగైన ప్రతిభ
-వరుసగా ప్రభుత్వ కళాశాలల్లోనే అధిక ఉత్తీర్ణత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ప్రైవేటు కళాశాలల కంటే మెరుగైన ఉత్తీర్ణతను నమోదు చేస్తున్నాయి. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 88.11 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రైవేటు కళాశాలల్లో 80.68 శాతమే ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత 7.43 శాతం మేర అధికంగా నమోదైంది. 2025–26 విద్యా సంవత్సరంలో సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడలో 93.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆంధ్ర వైద్య కళాశాల, విశాఖపట్నంలో 93.20 శాతం, శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల, తిరుపతిలో 92.50 శాతం, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 92 శాతం ఉత్తీర్ణత నమోదయ్యాయి. కర్నూలులో 90.80 శాతం, మచిలీపట్నంలో 88.67 శాతం, రాజమహేంద్రవరంలో 88 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇతర కళాశాలల్లో ఏసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరులో 86.86 శాతం, నంద్యాలలో 86.51 శాతం, రంగరాయ వైద్య కళాశాల, కాకినాడలో 86 శాతం, శ్రీకాకుళంలో 86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అనంతపురంలో 84.92 శాతం, ఏలూరులో 84.67 శాతం, గుంటూరులో 84 శాతం, విజయనగరంలో 83.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే కొన్ని కళాశాలల్లో ఉత్తీర్ణత తగ్గగా, మరికొన్ని కళాశాలల్లో పెరిగింది. ముఖ్యంగా పాడేరు, మచిలీపట్నం, ఆంధ్ర వైద్య కళాశాలల్లో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.

2024–25లో ప్రభుత్వ కళాశాలల్లో…

2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 93.48 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు కళాశాలల్లో 88.64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల మొత్తం ఉత్తీర్ణత 91 శాతంగా నమోదైంది. ఆ ఏడాది రాజమహేంద్రవరం వైద్య కళాశాలలో 98 శాతం, గుంటూరులో 97.60 శాతం, ఏలూరులో 97.33 శాతం, కర్నూలులో 96.80 శాతం, శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల, తిరుపతిలో 96.67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడలో 93.71 శాతం, ఏసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరులో 93.71 శాతం, ఆంధ్ర వైద్య కళాశాల, విశాఖపట్నంలో 91.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ వివరాలను ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ సాయి సుధీర్‌, పరీక్షల నియంత్రణాధికారి శ్రీకాంత్‌ తెలిపారు.

ఫలితాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉత్తీర్ణతను మరింత పెంచేందుకు కళాశాలల వారీగా ఫలితాలను విశ్లేషించి, విద్యార్థుల అభ్యసన స్థాయికి అనుగుణంగా అవసరమైన బోధనా సహకారం అందిస్తామని వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ విష్ణువర్ధన్‌ తెలిపారు.