బందరు కార్పొరేషన్ కూటమిదే…

-మచిలీపట్నంలో కూటమి నాయకుల ప్రచార జోరు
-కూటమి పాలనలో మాత్రమే బందరు అభివృద్ధి సాధ్యం
-58, 60 వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి జెండా ఎగరేయడం తథ్యమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నం నగరంలోని 58, 60వ డివిజన్ల అభ్యర్థులు వడ్డీ చిరంజీవి, వల్లే సీతామహ లక్ష్మీ, పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ల జగన్నాథ రావు గారు, కూటమి మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబిదా గారితో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ హామీలను, చేసిన అభివృద్ధిని వివరించారు. పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి చాలా మంచి స్పందన లభిస్తోందని, కూటమి అభ్యర్థులను అమూల్యమైన ఓట్లతో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఘనమైన చరిత్ర కలిగిన మచిలీపట్నంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తరకటూరులో 200 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేశాం. వాటర్ ఫిల్ట్రేషన్ కోసం రూ. 16 కోట్లు వెచ్చించి ప్రతిరోజూ మంచినీరు అందించేలా చర్యలు చేపట్టాము. భవిష్యత్తులో కృష్ణా నీటిని నేరుగా పంపింగ్ చేసి మచిలీపట్నానికి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గతంలో నిలిచిపోయిన డ్రైనేజీ పనులను మళ్లీ గాడినపెట్టి, సుమారు రూ. 65 కోట్ల వ్యయంతో నూతన పనులు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. నివాస స్థలాల కేటాయింపు, జి+3 ఇళ్ల నిర్మాణం ద్వారా ప్రతి ఒక్కరికీ స్వగృహం కల్పించడమే తమ లక్ష్యం. అదేసమయంలో రోడ్లు డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తున్నాం. ఆక్రమణకు గురైన పార్కులను పునరుద్ధరించడంతో పాటు, సీఎస్‌ఆర్ ఫండ్స్ మరియు ఫీనిక్స్ సంస్థ సహకారంతో రూ. 1.5 నుండి 2 కోట్ల వ్యయంతో శ్మశానవాటికలను సుందరమైన పార్కులుగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ వద్ద ఇప్పటికే ఫైలాన్ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.