Breaking News

పేదల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేదల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గృహ నిర్మాణంపై ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో పలు శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై సుధీర్ఘంగా చర్చించారు. తొలుత టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. 300 చ.అడుగుల కేటగిరీకి సంబంధించి 400 ఇళ్లు పూర్తి అయినట్లు అధికారులు ఎమ్మెల్యేకు దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు వీరందరికీ రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని.. పంపిణీ తేదీ ఖరారు చేయవలసిందిగా అధికారులకు మల్లాది విష్ణు సూచించారు. అనంతరం నున్న, సూరంపల్లి, కొండపావులూరు జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. పేదల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 179.62 కోట్లు వెచ్చించి 428.62 ఎకరాలలో నియోజకవర్గంలో 22,754 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. అలాగే ఒక్కో ఇంటికి రూ. లక్షా 80 వేలు చొప్పున రూ. 409.57 కోట్లు మొత్తంగా రూ. 589.19 కోట్లు పేదల గృహాలకు కేటాయించినట్లు వివరించారు. కనుక ముఖ్యమంత్రి ఆశయ సాధన కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నిర్దేశ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నించాలన్నారు. పనులు వేగవంతం చేయడంతో పాటు.. మౌలిక సదుపాయాలు, విద్యుద్దీకరణ పనులు కూడా సమాంతరంగా జరిగేలా చూడాలన్నారు. తొలి దశకు సంబంధించి గృహ నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు తనకు తెలియపరచాలని.. ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఓ యూసిడి శకుంతల, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలాజీ, డీఈ(హౌసింగ్) రవికాంత్, నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, ఏఈ (టిడ్కో) సతీష్, సీడీఓ జగదీశ్వరి పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *