తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
చేయూత, ఆసరా ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందిన మహిళలు పశు సంపద ను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక సచివాలయం -1 పరిధిలో జాతీయ జీవనోపాధి మిషన్ సౌజన్యంతో “జగనన్న పాలవెల్లువ ” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో పశు సంపద ద్వారా జీవనోపాధి పై ఆధారపడిన కుటుంబ నేపథ్యం ఉన్న వారు ఉన్నారన్నారు. కొవ్వూరు డివిజన్ లో నల్లజర్ల, తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో ఎక్కువ మంది కుటుంబాలు పశువుల పోషణ చేసి జీవనోపాధి పొందుతుంటారని అన్నారు. డ్రై ల్యాండ్, మెట్ట ప్రాంతాల్లో ఉండే వాళ్ళ ఇళ్లల్లో పాడి పశువులు ఖచ్చితంగా ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద 18 నుంచి 45 ఏళ్ళ వయస్సు కలిగిన మహిళలకు ఏటా రూ.18750 చొప్పున గత నాలుగేళ్లలో రూ.75 వేలు నేరుగా నగదు బదలీ పధకం కింద వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. ఆ మొత్తం పశు సంపద అభివృద్ధి కోసం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పశు సంపద కలిగిన కుటుంబాలను ప్రోత్సహించడం జరుగు తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాల సేకరణ చేపడుతున్న అమూల్ కేంద్రాలకు పాలను అందచేసి ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు పశువులను ప్రజా ప్రతినిధులు, అధికారులతో చేతుల మీదుగా అందచేశారు. డ్వాక్రా మహిళలకు వైయస్ఆర్ చేయూత , స్త్రీ నిధి ద్వారా పశువుల కొనుగోలు చేసే క్రమంలో పెట్టుబడి సహాయంగా ఉండే అవకాశం ఉందని, రైతు కిసాన్ కార్డులను అందచేసి బ్యాంకర్లు కూడా వారి వంతుగా ముందుకు వచ్చి మరిన్ని రుణాలను మంజూరు చేసి, వారికి ఆసరాగా నిలవాలని కోరారు. జాతీయ జీవనోపాధి మిషన్ కింద చేపడుతున్న జగనన్న పాల వెల్లువ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ, జిల్లా పశు సంవర్ధక అధికారి ఎస్ జి టి. సత్య గోవింద్, డిపివో జె వి సత్యనారాయణ, ఏం పీ డి వో డి వి రమణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు , డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.