– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-26 వ డివిజన్ 30 వ సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల మద్ధతు సంపూర్ణంగా ఉందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 26 వ డివిజన్ 30 వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామతో కలిసి ఆయన పాల్గొన్నారు. D.B.R.K రోడ్డు, కాల్వకట్ట వెంబడి విస్తృతంగా పర్యటించి.. 180 గడపలను సందర్శించారు. డాక్టర్లు, న్యాయవాదులు, ఉద్యోగులు, వర్తక వ్యాపారస్తులతో మమేకమవుతూ ముందుకు . సమాజంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు తెలియజెప్పేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని మల్లాది విష్ణు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మేథావులు అడుగులు కలపడం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు.
4 శాతం రిజర్వేషన్ ఆ మహానేత పుణ్యమే
ఇక్బాల్ భాషా, రిటైర్డ్ టీచర్ మాట్లాడుతూ.. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్ తమ పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగాలకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. ఆ మహానేతకు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. మైనార్టీల అభ్యున్నతికి ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి , ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా అండగా నిలిచారని మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో మైనార్టీ సంక్షేమం కోసం కేవలం ఖర్చుచేసింది రూ. 2,665 కోట్లు మాత్రమేనని.. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో 60,54,839 మైనార్టీలకు వివిధ పథకాల ద్వారా రూ. 20 వేల కోట్లకు పైగా లబ్ది చేకూర్చినట్లు వెల్లడించారు. ముస్లిం మైనార్టీలకు సంబంధించిన సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడంతో పాటు ఉర్దూ భాషకు గుర్తింపు తెచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల ఏపీ నుంచి తొలిసారిగా హజ్ యాత్ర ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. అలాగే వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా మైనార్టీ కుటుంబాలలో వివాహానికి ప్రభుత్వం నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందుతున్నట్లు తెలిపారు. దేశంలోనే మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని మల్లాది విష్ణు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టడమే ప్రతిపక్షాల పని
రాష్ట్ర ప్రజలకు వీలైనంత మంచి చేయడమే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని మల్లాది విష్ణు అన్నారు. కానీ సొంత అజెండా అంటూ లేని ప్రతిపక్ష పార్టీలు.. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న కార్యక్రమాలను కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మారుస్తూ.. ప్రజలను మరోసారి మోసం చేయడానికి వస్తున్నాయని విమర్శించారు. అటువంటి బూటకపు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా.. లక్షలాది కుటుంబాలకు మేలు చేకూర్చడం జరుగుతోందని మల్లాది విష్ణు అన్నారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమమే ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించినా, న్యాయస్థానాలలో కేసులు వేసినా.. పేదల సొంతింటి కల సాకారం చేసి తీరుతామని స్పష్టం చేశారు. మరోవైపు కలెక్టర్ ఆదేశాలతో నిషేధిత భూముల జాబితా సెక్షన్ 22(ఏ) లో ఉన్న భూముల తొలగింపునకు మార్గం సుగుమం అయిందని మల్లాది విష్ణు అన్నారు. కనుక ప్రజలు మీమీ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సంప్రదించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేసుకోవలసిందిగా సూచించారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లుట్ల వంశీ, నాయకులు కోలా నాగాంజనేయులు, పసుపులేటి కోటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.