విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారము, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా | శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారములో దర్శనమిస్తారు. మూలా నక్షత్రం శ్రీఅమ్మవారి జన్మనక్షత్రం.మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవికీ శరన్నవరాత్ర ఉత్సవాలలో మూలానక్షత్రంరోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారం అలంకరించబడుతుంది. సరస్వతీదేవిని సేవించడం వలన, వాగ్దేవి అనుగ్రహం కలిగి విద్యార్ధినీ విద్యార్ధులు సర్వ విద్యలయందు విజయం పొందుతారు. భక్తులు మూలానక్షత్రం నుండి విజయథమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీదుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయప్రదాయకం.
Prajavartha Online Telugu News