-ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు
-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నబ్’ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారి ఈ నెల 28న బాపట్ల – విశాఖపట్నం మధ్య యానాం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షించి, జిల్లా ప్రజలకు పలు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. తీవ్ర ఈదురు గాలులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు రోడ్డు ప్రయాణాలు మానుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదకర ప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిరావాలన్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను ముందస్తుగానే ఆసుపత్రులకు తరలించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పడవలు, టూరిస్ట్ బోట్ల రాకపోకలు, గేమ్ పార్కులను పూర్తిగా నిలిపివేయాలన్నారు. చెట్లు, శిథిలావస్థ భవనాలు, తాత్కాలిక షెడ్ల కింద ఆశ్రయం పొందవద్దని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలోకి గానీ, ఉధృతంగా ప్రవహించే కాలువలు, చెరువుల వద్దకు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని హెచ్చరించారు. మూగజీవాలను సురక్షిత పాకల్లో ఉంచాలని, చెట్లకు, స్తంభాలకు కట్టేయరాదన్నారు. కోసిన ధాన్యాన్ని రైతులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని సూచించారు. తీవ్ర తుఫాన్ దృష్ట్యా అక్టోబర్ 27, 28 తేదీలలో అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాలను తప్పక విద్యాసంస్థలు పాటించాలని ఆదేశించారు. విద్యాసంస్థలకు ఇచ్చే సెలవుల్లో పిల్లలను పూర్తిగా ఇళ్లలోనే ఉంచాలని, విహారయాత్రలకు వెళ్లరాదు. తుఫాన్‌పై సోషల్ మీడియాలో వదంతులు, అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తుఫాన్ సంబంధిత సమాచారం మరియు సహాయక చర్యల కోసం కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌లో నంబర్ 91549 70454 ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
