-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ అభివృద్ధికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే గొప్ప స్ఫూర్తి అని,నాటి సమాజంలోని అంటరానితనం,వివక్షతల పై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు కొనియాడారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 67 వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వార్డు, గ్రామ సచివాలయ డైరెక్టర్, కృష్ణాజిల్లా తుపాను ప్రత్యేక అధికారి లక్ష్మీశా, జిల్లా ఎస్పీ పి.జాషువా, సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తొలుత జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా ప్రత్యేక అధికారి లక్ష్మీశా, సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ లు స్థానిక అంబేద్కర్ సర్కిల్ ( పాత లక్ష్మీ టాకీస్ సెంటర్ ) వద్దగల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ, డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ 1956 డిసెంబరు 6న మరణించారని, వారు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో విద్యతో పాటు వారికి సరైన హక్కులను కల్పించడంలో విజయవంతమయ్యారన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, రాజకీయవేత్త అలాగే, సంఘ సంస్కర్త కూడా అని కలెక్టర్ పేర్కొన్నారు.. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాంతం దళిత జాతి సంక్షేమం, స్వేచ్ఛ కోసం కృషి చేశారన్నారు.ఆయన జీవితం ఆదర్శనీయమని, నేటి యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ఉన్నతమైన చదువులు చదివి ప్రపంచ చరిత్రలో మహనీయుడుగా మేధావిగా వెలుగొందారని కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెద్ది రోజా, జిల్లా ఎస్సీ సాధికారత అధికారి షాహిద్ బాబు, కలెక్టరేట్ కార్యాలయం, సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు