– అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రుణ పరిమితి ప్రతిపాదనలు
– డీఎల్‌టీసీ సమావేశంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సాగు ఖర్చులకు అనుగుణంగా రైతులకు పంట రుణాల మంజూరుకు మార్గదర్శకాల ప్రకారం పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్-ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్‌టీసీ) సమావేశం శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ డిల్లీరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, ప్రగతిశీల రైతులు, బ్యాంకర్లు తదితరులు హాజరుకాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పంటలకు ఎకరా విస్తీర్ణానికి రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)పై ప్రతిపాదనల రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో వివిధ పంటల సాగు వ్యయం, పంట దిగుబడి విలువ, రుణ పరిమితి వివరాలను పరిశీలించి.. తదుపరి 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాగు ఖర్చు, దిగుబడి విలువ అంచనాల ఆధారంగా నిర్ణయించాల్సిన రుణ పరిమితిపై వ్యవసాయం, ఉద్యాన, మత్స్య తదితర శాఖల అధికారులు తమ అభిప్రాయాలను సమావేశం ముందుంచారు. అదే విధంగా రైతులు వివిధ పంటల సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కోతలు తదితరాలకు అయ్యే ఖర్చుల వివరాలను తెలియజేశారు. అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ ద్వారా 2024-25కు గాను వరికి రుణ పరిమితి రూ. 42 వేలు, మిరప (డ్రై)కు రూ. 95 వేలు, మిరప (ఇరిగేటెడ్)కు రూ. లక్ష, మామిడికి రూ. 41 వేలు, ఆయిల్‌పామ్‌కు రూ. 75 వేలు, పట్టు పురుగుల పెంపకానికి రూ.లక్ష ఇలా వివిధ పంటలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రుణపరిమితిని ప్రతిపాదించడం జరిగిందని.. వీటిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీకి పంపనున్నట్లు తెలిపారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి)కి అదనంగా 30 శాతం వరకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు అవకాశముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాల రైతుల సంక్షేమానికి అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఈ సందర్భంగా కలక్టర్ డిల్లీరావు రైతులకు సూచించారు. సమావేశంలో ఎల్‌డీఎం కె.ప్రియాంక, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ సీఈవో ఎ.శ్యామ్ మనోహర్, జీఎం బి.ఎల్.చంద్రశేఖర్, జీఎం ఎన్.రంగబాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.నాగమణెమ్మ, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి వి.పెద్దిబాబు, జిల్లా సెరీకల్చర్ అధికారి ఎన్.సత్యనారాయణ, ప్రగతిశీల రైతులు ఎస్‌వీ రమేష్ బాబు, బి.నాగిరెడ్డి, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐవోబీ, యూకో తదితర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.