– రక్తహీనత సమస్యను అధిగమించడంలో సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు
– రాష్ట్ర వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, పెద్ద ఎత్తున నిర్వహిస్తోందని.. వీటిని విద్యార్థులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ అన్నారు. శుక్రవారం విజయవాడ పటమట లంక, శ్రీ కొమ్మా సీతారామయ్య బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ.. ఆర్బీఎస్కే స్టేట్ నోడల్ అధికారి డా. ఇ.ప్రశాంత్, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని తదితరులతో కలిసి చిన్నారులకు అల్జెండజోల్ మాత్రలు అందించారు.
ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ ఆరోగ్య భద్రతా కార్యక్రమాలను అమలుచేయడం జరుగుతోందని.. చిన్నారుల్లో రక్తహీనత అనేది లేకుండా చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడంతో పాటు మూడు నెలలకు ఓసారి అనీమియా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ పాఠశాల విద్యా శాఖతో సమన్వయం చేసుకుంటూ రక్తహీనత సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ చర్యలు నాలుగేళ్ల కాలంలో మంచి ఫలితాలు ఇచ్చినట్లు తెలిపారు. నులి పురుగులను నిర్మూలించడం ద్వారా చిన్నారులకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు పెద్ద ఎత్తున జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమలో గౌరవ ప్రజాప్రతినిధులు పాల్గొంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.29 లక్షల సంస్థల్లో, దాదాపు 1.32 కోట్ల మంది పాఠశాల, కళాశాల విద్యార్థులకు మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు కమిషనర్ జె.నివాస్ వివరించారు.
విద్య, వైద్య రంగానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న ప్రభుత్వం: కలెక్టర్ డిల్లీరావు
కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తోందని తెలిపారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం ఏర్పడుతుందని.. వివిధ శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వివరించారు. అల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారినపడకుండా చూడొచ్చన్నారు. శుక్రవారం 1-19 ఏళ్ల వయసు వారందరికీ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ జరుగుతుందని.. మిగిలి పోయిన వారికి ఫిబ్రవరి 16వ తేదీన మాత్రలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అపోహలు వీడి మాత్రలను కచ్చితంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నాడు నేడు, నాణ్యమైన విద్య, పౌష్టికాహార కార్యక్రమం తదితరాలను ఉపయోగించుకొని కెరీర్ పరంగా ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ డిల్లీరావు విద్యార్థులకు సూచించారు.
ఎదుగుదల బాగుండాలంటే నులి పురుగుల నిర్మూలన జరగాలి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మీరు తినే తిండి ఒంటికి పట్టి ఎదుగుదల బాగుండాలంటే తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు గౌరవ ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద, ఇంగ్లిష్ మీడియం చదువులు.. ఇలా ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని.. విదేశాల్లో చదువుకోవాలన్నా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ఉందని పేర్కొన్నారు.
కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి: తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్
విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నారని.. చిన్నారులు వీటిని సద్వినియోగం చేసుకొని ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థానాలను కైవసం చేసుకోవాలని సూచించారు. కమిషనర్ జె.నివాస్, కలెక్టర్ డిల్లీరావు వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఉన్నత భవిష్యత్తును సొంతం చేసుకునేందుకు కష్టపడి చదవాలని సూచించారు. రక్తహీనత సమస్య నుంచి బయటపడేందుకు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని దేవినేని అవినాష్ సూచించారు. కార్యక్రమంలో భాగంగా చేతులు శుభ్రం చేసుకోవడంపై అవగాహన కల్పించేలా విద్యార్థుల నృత్య రూపకం ఆకట్టుకుంది.
కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డీఎస్ఈవో యూవీ సుబ్బారావు, పాఠశాల హెచ్ఎం ఎ.లక్ష్మీకుమారి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.