ఏర్పేడు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర విద్యా సంస్థ అయిన ఐఐటి లో పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఐఐటి, కు సంబంధించిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్ తో కలిసి ఐఐటి డీన్ ప్లానింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మురళీకృష్ణ, డిప్యూటీ రిజిస్ట్రార్ చమన్ మెహతా, ఈఈ సివిల్ చైతన్య, సంబంధిత అధికారులతో సమీక్షించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులకు, ఆర్ అండ్ బి సంబంధించి కూడలి ఏర్పాటు కు డిజైన్ మేరకు చర్యలు చేపట్టాలని, అలాగే ఐఐటి వద్ద బస్ స్టాప్ ఏర్పాటుకు ఎన్ హెచ్ వారు క్లియరెన్స్ త్వరితగతిన ఇవ్వాలని, లెవెల్ క్రాసింగ్ క్లోజర్ పై క్లియరెన్స్ కు సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. త్రాగు నీరు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు త్రాగు నీరు అంశంపై ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ వారు దృష్టి పెట్టి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. వీధి దీపాలు ఏర్పాటుకు సంబంధించి అంచనాలు తయారు చేయాలని, ఎలక్ట్రిసిటీ సంబంధిత అంశాలకు గాను వారంలోపు ప్రణాళికలు సిద్ధం కావాలని అధికారులతో అన్నారు. ఆర్టీసీ వారు ఐఐటి రిక్వెస్ట్ బస్ స్టాప్ వద్ద బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ సంబంధిత సమస్యలు పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గార్బేజ్ డిస్పోజల్ సిస్టమ్ ఏర్పాటుకు శాశ్వత పరిష్కార దిశగా ప్రణాళికలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐఐటి వారికి సూచించారు. తాత్కాలికంగా జిల్లా యంత్రాంగం తరపున సహకారం అందిస్తామని తెలిపారు. ఐఐటి కి సంబంధించిన వీడియో విజువల్స్ అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై తిలకించి చర్చించారు.
ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవి శంకర్ రెడ్డి, ఎస్.ఈ లు ఏపీఎస్పీడిసిఎల్ కృష్ణా రెడ్డి, ఆర్ డబ్ల్యూఎస్ విజయ కుమార్, ఐఐటి ప్రతినిధులు, జి సెక్షన్ సూపరింటెండెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.