గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతుందని, సోమవారానికి పనుల పురోగతి పై నివేదిక ఇవ్వాలని సూపర్వైజరి అధికారులను నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్ లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజికవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులకు, వికలాంగులకు, వీలుగా ర్యాంపులు, విద్యుత్, త్రాగునీటి సరఫరా, మరుగు దొడ్లు వంటి కనీస వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఏఈల వారిగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు తగు ఆదేశాలు జారీ చేశామని, బిఎల్ఓలు, సూపర్వైజరి అధికారులు ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనుల వేగవంతంకు చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం నాటికీ పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులపై సూపర్వైజరి అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లోని పోలింగ్ కేంద్రాలను ఏఈఆర్ఓలు పరిశీలించి, కేంద్రాల్లో ర్యాంప్ లు, విద్యుత్ వంటి వసతుల ఏర్పాటు చేయించాలన్నారు. కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యం పరిశీలించాలని, మరుగుదొడ్లకు ఏమైనా మరమత్తులు చేపట్టాల్సి ఉంటే వెంటనే పూర్తి చేసేలా సూచించాలన్నారు.
Prajavartha Online Telugu News