Breaking News

ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారు

-అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఆ పరిధిలోనే ఉండాలి
-ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
-ఎన్నికల ప్రచారానికి, ర్యాలీలకు ప్రదర్శనలకు అనుమతులు తప్పనిసరి
– జిల్లా ఎన్నికల అధికారి క‌లెక్ట‌ర్ డా. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ను (ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి) అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుందనీ, ఎవరైనా ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవడం జరుగుతుందని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కే. మాధవీలత స్పష్టం చేశారు.

బుధ‌వారం క‌లెక్ట‌ర్ ఛాంబర్ లో కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయినందున ప్ర‌తీ ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఎన్నికల నియ‌మావ‌ళిని, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల‌న్నారు . ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ధేశించిన‌ మేరకు అనుమ‌తులను తీసుకోవాల‌ని సూచించారు. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన నాటి నుంచి అధికారులు, రాజకీయ నాయకులు ఎన్నికల కమీషన్ నిర్దేశించిన ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారన్నారు. జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఖ‌చ్చితంగా అమ‌లు చేయ‌డానికి అన్నిరకాల చర్యలూ తీసుకున్నా మని అన్నారు. రాజకీయ ప్రతినిధులు గాని, ఎవరైనా పోస్టర్లు, బ్యాన‌ర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, హోమ్ టు హోమ్ ప్రచారం, సమావేశాలు, సభలు, వాహనాల ద్వారా ప్రచారం క్యాంపైన్ వంటివి నిర్వహణకు సంబంధిత నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలన్నారు.

అధికారులు ఎవరూ పొలిటికల్ పార్టీలతో అనుసంధానం ఉండరాదని, వారు నిర్వహించే సమావేశాలకు హాజరు కాకూడదన్నారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించి అటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.

ఎల‌క్ట్రానిక్ మీడియా ఛాన‌ళ్లు, రేడియో, సోష‌ల్ మీడియా, బ‌ల్క్ ఎస్ఎంఎస్‌, డిజిట‌ల్ బోర్డుల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాలంటే ముంద‌స్తు అనుమ‌తి తీసుకోవాల‌ని చెప్పారు. ఆటోలు, బ‌స్సులు త‌దిత‌ర ప్ర‌జా ర‌వాణా వాహ‌నాల్లో కూడా అనుమతి లేకుండా రాజ‌కీయ పార్టీల స్టిక్క‌ర్లు, బ్యాన‌ర్లు పెట్ట‌కూడ‌ద‌ని స్పష్టం చేశారు. పేప‌ర్ల‌లో ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వడానికి ముంద‌స్తు అనుమ‌తి అక్క‌ర‌లేద‌ని, పెయిడ్ న్యూస్‌ను అభ్య‌ర్ధుల ఖాతాలో ఖ‌ర్చుగా రాయ‌డం జ‌రుగుతుంద‌ని వివరించారు. మైకులు, ప్ర‌చార‌ వాహ‌నాలు, స‌భ‌లు, స‌మావేశాలు, ర్యాలీలు, అభ్య‌ర్ధుల ప్ర‌చారానికి ముంద‌స్తు అనుమ‌తిని వివిధ స్థాయిల్లో తీసుకోవాల‌ని చెప్పారు. సింగిల్ విండో విధానంలో, రిటర్నింగ్ అధికారుల ద్వారా అన్ని రకాల అనుమ‌తులు మంజూరు చేయ‌డం జ‌రుగు తుంద‌ని చెప్పారు. వీలైనంత వ‌ర‌కు సువిధ యాప్ ద్వారా అనుమ‌తుల‌కు ధ‌ర‌ఖాస్తు చేయాల‌ని కోరారు. ఇప్ప‌టికే జ‌రుగుతున్న అభివృద్ది ప‌నులు కొన‌సాగుతాయ‌ని, కొత్త‌గా పనులు మంజూరు చేయ‌డం జ‌ర‌గ‌ద‌ని అన్నారు.

జిల్లాలో మొత్తం 1577 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్ని పోలింగు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, అన్ని వసతులును కల్పించి సిద్ధం చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓట‌ర్ల జాబితాలో తొల‌గింపులు, మార్పులు ఉండ‌వ‌ని, వాటికోసం వ‌చ్చే ధ‌ర‌ఖాస్తులను ప‌రిశీలించ‌డం జ‌రగ‌ద‌ని చెప్పారు. జాబితాలో కొత్త‌గా పేర్లు చేర్చ‌డానికి ఫారం 6 ద్వారా 18 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న వారికి, ఫారం – 8 ద్వారా ఒక చోట నుంచి మ‌రో చోట‌కి ఓటు బ‌దిలీకి మాత్రం అవ‌కాశం ఉంద‌ని మాధవీలత అన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *