-ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు
-అక్రమ మద్యం, డబ్బు ఇతరత్రాలను గుర్తిస్తే తక్షణమే చర్యలు
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు, విలువైన వస్తువులు తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంటుందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు స్పష్టం చేశారు.
కలెక్టర్ డిల్లీరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరాణా టాటా శనివారం వివిధ చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాల తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం అటవీ చెక్‌పోస్టుతో పాటు తిరువూరు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు తదితరాలను తనిఖీ చేశారు. చెక్‌పోస్టుల వద్ద కార్యకలాపాలను పరిశీలించి.. పటిష్ట నిఘాకు అనుసరించాల్సిన వ్యూహాలపై సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. తిరువూరు, మైలవరం పరిధిలోని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లకు వివిధ ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 21 చెక్‌పోస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. లోపాలు ఏవైనా ఉంటే వెంటనే చక్కదిద్దుతున్నట్లు వెల్లడించారు. అధిక మొత్తంలో నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువుల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పోలీస్, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సిబ్బందితో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా మోహరించినట్లు వివరించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేయడం జరుగుతోందని, జిల్లాలో 42 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదని.. తప్పనిసరైతే అందుకు సంబంధించి సరైన ఆధారాలు ఉండాలని, లేకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నగదు సీజర్స్‌ను పరిశీలనకు జిల్లాస్థాయి కమిటీ పనిచేస్తోందని రూ. 10 లక్షలకు మించితే ఐటీకి సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ. కోటి వరకు నగదును, రెండున్నర కిలోల వరకు బంగారాన్ని సీజ్ చేయడం జరిగిందని.. రాష్ట్రంలోనే అత్యధిక సీజర్స్ జిల్లాలో జరిగినట్లు వివరించారు.
ఫిర్యాదులపై సత్వర విచారణ, పరిష్కారం:
సీ విజిల్‌తో పాటు, 1950 ఓటర్ హెల్ప్‌లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ (ఎన్జీఎస్పీ), జిల్లాస్థాయి కాల్‌సెంటర్ తదితరాలకు వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు సత్వరం స్పందించి.. నాణ్యతతో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పరిష్కారానికి సంబంధించిన వివరాలను ఫిర్యాదుదారునికి తెలియజేస్తున్నట్లు వివరించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వస్తున్న ప్రతికూల వార్తల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు వివరించారు. సీజర్స్ మేనేజ్మెంట్ వ్యవస్థ, నివేదికల నిర్వహణ వ్యవస్థ (ఆర్ఎంఎస్) కూడా పకడ్బందీగా పనిచేస్తున్నట్లు తెలిపారు. వాలంటీర్లు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు రాజకీయ సభలు, ర్యాలీలు తదితరాల్లో పాల్గొనకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపర చర్యలు ఉంటాయని కలెక్టర్ డిల్లీరావు స్పష్టం చేశారు. కలెక్టర్ డిల్లీరావు వెంట తిరువూరు ఆర్డీవో కె.మాధవి, ఏసీపీ మురళీ మోహన్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.