– క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు క్రియాశీలంగా పనిచేయాలి
– డేటా అప్‌లోడింగ్‌లో వేగం, కచ్చితత్వం అవసరం
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రలోభాలకు అడ్డుకట్ట వేసి.. నిష్పక్షపాత వాతావరణంలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎథికల్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (ఈఎస్ఎంఎస్)ను సమర్థవంతంగా అమలుచేయడంపై ఎన్ఫోర్స్‌మెంట్ విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి ఆర్వోలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల నోడల్ అధికారులు తదితరులతో ఎలక్షన్ సీజర్లపై సమావేశం నిర్వహించారు. తొలుత ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, జిల్లా మొత్తంమీద జరిగిన సీజర్ల వివరాలను తెలియజేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దాదాపు రూ. 1.27 కోట్ల నగదు, 2,503 లీటర్ల మద్యం, 4,100 గ్రాముల మత్తు పదార్థాలు, 7,139 గ్రాముల విలువైన లోహాలు తదితరాలను కలుపుకొని మొత్తంమీద దాదాపు రూ. 3.60 కోట్ల విలువైన నగదు, వస్తువులను సీజ్ చేసినట్లు వివరించారు. నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులు తదితరాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులతో జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు అప్రమత్తతతో, క్రియాశీలంగా పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి బృందాలతో పోలీస్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్, ఐటీ, కమర్షియల్, ఫారెస్ట్, బ్యాంకింగ్, ప్రజా రవాణా తదితర విభాగాల జిల్లా నోడల్ అధికారుల మధ్య మంచి సమన్వయం ఉండాలన్నారు. ఈఎస్ఎంఎస్ యాప్‌లో సీజర్లకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా కచ్చితత్వంతో అప్‌లోడ్ చేయాలని సూచించారు. రోజువారీ సీజ్‌ల సమాచారాన్ని సంబంధిత నియోజకవర్గాల ఆర్‌వోలకు కూడా పంపాలన్నారు. నివేదికల రూపకల్పనపైనా దృష్టిసారించాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు. జిల్లాస్థాయి గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ కార్యకలాపాలు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, ఆర్‌డీవోలు బీహెచ్ భవానీ శంకర్, కె.మాధవి, రవీంద్రరావు, ఏడీసీపీ ఎం.కృష్ణమూర్తినాయుడు, ఎల్‌డీఎం కె.ప్రియాంక, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.